Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : తులసీ వైభవం (ఆడియోతో…)

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఇంద్రాది దేవతలు చేత భగవతి అయిన తులసి నిరంతరం సేవించదగినది. ఆ విధంగా సేవించినచో చతుర్వర్గ ఫలమును ప్రసాదించును. స్వర్గలోకమున, మర్త్య లోకమున, పాతాళ లోకమున కూడా తులసి దుర్లభమైనది. తులసి యందు భక్తి కలవారికి ధర్మార్థ కామ మోక్షములు లభించునని పద్మపురాణం ఉత్తరకాండం, ఉత్తరార్ధంలో క్రియాయోగ సారకాండంలో తులసి వైభవంలో వివరించబడినది.

లక్ష్మీ: సరస్వతీ చైవ గాయత్రీ చండికా తదా
సర్వాశ్చాన్యా దేవ పత్న్యి తతృత్రేషు వసంతి చ
ఇంద్రోగ్ని: శమనశ్చైవ నైరుతి: వరుణస్థధా
పవనశ్చ కుబేరశ్చ తచ్ఛాకాయాం వసంత్యమి
ఆదిత్యాది గ్రహేసర్వే విశ్వేదేవాశ్చ సర్వదా
వసవ: మునయశ్చైవ తధా దేవర్ష యోఖిలా:
కోటి బ్రహ్మాండ మధ్యేషు యాని తీర్థాని భూతలే
తులసీ దల మాశ్రిత్య తాన్యేవ నివసంతిహి

లక్ష్మీ, సరస్వతీ, గాయత్రీ, చండికా, సకల దేవపత్నులు తులసీ పత్రమున నివసింతురు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు తులసి కొమ్మలలో నివసించెదరు. ఆదిత్యాది నవ గ్రహములు, విశ్వే దేవతలు, వశువులు, మునులు, సకల దేవర్షులు కొలువై ఉందురు. అలాగే అనంతకోటి బ్రహ్మాండాలలో ఉన్న సకల తీర్థములు తులసీ దలమును ఆశ్రయించి నివసించుచున్నవి.

భక్తి భావంతో తులసిని సేవించు వారు సకల తీర్థములను, బ్రహ్మాదిదేవతలను సేవించిన వారగుదురు. తులసీ వృక్షము మూలమున ఉన్న గడ్డి, ఇతరములైన చెత్తను తొలగించిన వారు తమ దేహములో ఉన్న బ్రహ్మహత్యాది పాతకములను తొలగించుకున్నవారగుదురు. వేసవి కాలంలో సుగంధము గల చల్లని నీటితో తులసీ వృక్షమును తడిపినచో మోక్షము పొందుదురు. తులసీ వృక్షమునకు వెన్నెలను, ఎండలో గొడుగును ఇచ్చినచో సకల పాపములు నశించును. వైశాఖ మాసమున తరగని జలధారలతో తులసీ వృక్షమును తడిపినచో అశ్వమేధయాగ ఫలితము లభించును. ప్రవహించు జలమును ఒక్క దోసెడు తులసీ వృక్షమునకు పోసినచో సకల పాపములు తొలగి స్వర్గమును పొందెదరు.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement