భాగవతం ప్రథమ స్కంధం, నాల్గవ అధ్యాయంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
ఉత్తములు…
శివాయ లోకస్య భవాయ భూతయే య ఉత్తమ శ్లోక పరాయణా జనా:
జీవంతి నాత్మార్థం అసౌ పరాశ్రయం ముమోచ నిర్విద్య కుత: కలేవరమ్
ఉత్తముల చేత కీర్తించబడు పరమాత్మను సదా కీర్తించు పరమ భక్తులు లోకమునకు మంగళములను అభివృద్ధిని, సంపదలను కలిగించుటకు మాత్రమే బ్రతుకుతుంటారు, తమ కొరకు తాము బ్రతకరు. అంతటి ఉత్తమ భక్తుడైన పరీక్షిత్తు పరులకు ఐశ్వర్యమును, శుభమును కలిగించు తన శరీరమును ఎందుకు వదిలి పెట్టినాడు.
పరీక్షిత్తు ఋషి శాపము వలన విరక్తి చెంది శరీరమును విడిచి పెట్టుటకు గంగా తీరమున ప్రాయోపవేశము చేశారని విన్న శౌనక మహర్షికి సందేహము కలిగెను. నిరంతరము భగవంతుని ధ్యానము, కీర్తన, భజనలతో భగవంతుని కొరకై తమ బ్రతుకు అని భావించు పరమ భక్తులు తాము భగవద్భక్తితో సంసార దు:ఖమును తొలగించుకొని ఎలా ఆనందంతో కాలం గడుపుతున్నామో లోకం కూడా ఇలాగే భగవంతుని ధ్యానంతో ఆనందంగా బ్రతకాలి అని భావిస్తారు. లోకంలోని అన్ని బాధలు, అజ్ఞానం తొలగాలని, సం సారం దు:ఖమయమే కానీ సుఖమయమేనాటికి కాదు కాబోదని, దు:ఖమయమైన సంసారాన్ని సుఖమని తలచి భ్రమపడి బాధలు కొనితెచ్చుకుంటున్నారని, తమకు తెలిసిన ఈ సత్యాన్ని లోకానికి చెప్పాలి, లోకాన్ని సంతోషమయం, మంగళమయం చేయాలి, లోకమునకు ఆధ్మాత్మిక సంపద చేకూర్చి భక్తిని అభివృద్ధి చేయాలి, శుభమును సంతోషమును చేకూర్చాలి, భగవంతుని యందే మనసు కలిగేలా లోకాన్ని తీర్చిదిద్దాలి అని నిరంతరం లోకం కోసమే భగవద్భక్తులు బ్రతుకుతారు కానీ తమ కోసం తాము బ్రతకరు. అయినప్పుడు పరమ భక్త శిఖామణి అయిన పరీక్షిత్తు లోకమునకు ఉపకరించ వలసిన వాడు, లోకాన్ని ఉద్ధరించవలసిన వాడు విరక్తి చెంది దేహాన్ని విడిచి పెట్టాలని ఎలా భావించాడని శౌనక మహర్షి సందేహాన్ని వెలిబుచ్చారు. తన దేహం పరుల కోసం కదా పరోపకారానికి పనికివచ్చే దేహాన్ని తాను ఎలా విడిచి పెడతాడు అనేది ఇందులోని ఋషి హృదయం.
– శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి