శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
ఈరోజు హంస అవతారంలోని అర్థాన్ని గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
హంస
బ్రహ్మ లోకంలో మహర్షులు బ్రహ్మని, ఒకరికొకరు తారసపడినపుడు నీవెవరని ఎందుకు అడుగుతారని సందేహం వ్యక్తం చేస్తూ, శరీరం కోసమైతే మని షో, మృగమో చూడగానే తెలుస్తుంది, ఆత్మ కోసమైతే అన్ని ఆత్మలు ఒక్కటే కావున ఈ సందేహము ఎందుకని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం దొరకని బ్రహ్మ తన తండ్రిని తలచుకొనగా ఆ స్వామి హఠాత్తుగా హంస రూపంలో ఆవిర్భవించగా ఆశ్చర్యచకితులైన ఋషులు హంసను నీవెవరు, నీ రాకకు కారణం ఏమిటని ప్రశ్నించగా తాను హంసనని తనలో ఆత్మ ఉందని తెలిసి కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నారని హంస రూపంలో ఉన్న స్వామి సమాధానమిచ్చెను. హంస రూపంలో ఉన్నది శ్రీమన్నారాయణుడేనని తెలుసుకున్న ఋషులు సాష్టాంగ దండ ప్రణామము చేసి ఈ ధర్మ సూక్ష్మాన్ని వివరించమని ప్రార్థించారు. నీవెవరు అన్నదానికి వ్యక్తి పుట్టుక, తల్లిదండ్రుల పేర్లు, ఊరుపేరు తెల్పమని ప్రశ్నలోని పరమార్థమని మన పుట్టుక, మన వంశము, మన ఊరు, ప్రాప్తించిన విద్య ఇతర బంధాలన్నీ పూర్వజన్మ పుణ్య ఫలాలే అని, మనం కోరిన విధంగా కాకుండా కర్మానుగుణంగానే అన్నీ ప్రాప్తిస్తాయని ఋషులకు జ్ఞానబోధ చేశాడు శ్రీమన్నారాయణుడు. ఇటువంటి హంసగీతలు విష్ణుధర్మోత్తర మహాపురాణం, స్కాంద పురాణం, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్తం అలాగే మహాభారతంలో కూడా హంసగీతలు అనే పేరుతో పరమాత్మ చేసిన ప్రబోధాలు సుప్రసిద్ధాలు. హంస రూపమున ఉన్న పరమాత్మను పరమహంస అని అంటారు. కావున అన్ని త్యజించి పరహితం కోసం పాటుపడే సన్యాసులను పరమహంస అంటారు. ఈ ‘పరమహంస’అవతారం బ్ర హ్మదులకే బ్రహ్మరహస్యం చెప్పిన అవతారం. ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్య భగవానుడు అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే ప్రకాశాన్ని అందిస్తున్నాడు కావున సూర్య భగవానుని హంసావతారంగా భావించి, దర్శించి, ధ్యానించి జ్ఞాన వికాసాన్ని పొందాలి.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి