శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
ఈరోజు కల్కి అవతార ఆవిర్భావంపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
కల్కి
కలియుగం చివరలో ధర్మం పూర్తిగా కనుమరుగై అధర్మం అన్ని విధాల విజృంభించి వికటాట్టహాసం చేస్తున్నప్పుడు అనగా వేదం, దైవం, ధర్మం, సత్యం, త్యాగం, అహింస, రక్షణ పరిపాలన అనే మాటలు కనుమరుగై పోతాయి. ఆస్తి, దాంపత్య హక్కులు చివరికి బ్రతికే హక్కు కూడా అధర్మంతో హరించబ డుతుంది. బలమున్న వానిదే ధనం, రాజ్యం అన్ని మర్యాదలు, అన్ని ధర్మాలు అడుగంటి మూడు నాలుగు సంవత్సరముల వయస్సు మాత్రమే పరమాయుష్షుయై పశుప్రాయమైన జీవితాన్ని రాక్షస ప్రాయమైన వ్యవహారాన్ని మృగ ప్రాయమైన ప్రవృత్తి ని అలవరుచుకొని ఆహారము పానీయము దొరకక తోటి మనిషిని మనిషి చంపి తినే దారుణమైన స్థితి వచ్చినప్పుడు పరమాత్మ అధర్మ చరమావధిని పొందించి అపుడు తాను కల్కి రూపంలో అశ్వారూఢుడై కరవాలం చేతబూని అధర్మాత్ములను ఖండిస్తూ, అధర్మాన్ని రూపు మాపే అవతారం కల్కి అవతారం దానితో కలియుగం అంతం అవుతుంది. కలియుగం తరువాత మళ్లిd కృత యుగం వచ్చి ధర్మం వెల్లివిరుస్తుంది.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి