Friday, November 22, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్‌” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు ఋషభావతారం అవతార వైశిష్ట్యాన్ని గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

8. ఋషభావతారం
నాభి వలన మేరుదేవి యందు అవతరించిన ది ఋషభావతారము. ఋషభ అంటే సర్వోత్తమము, ధర్మము, నిగ్రహము, జ్ఞానము అని అర్థము. జ్ఞానముతో నిగ్రహమును సంపాదించి సర్వోత్తమ ధర్మమును తాను ఆచరించి ఆచరింపచేసిన అవతారము ఋషభావతారము. యోగ మార్గమును ప్రపంచానికి చాటిచెప్పినవాడు ఋషభుడు. ఈయన కుమారుడు జడభరతుడు తండ్రి వద్ద యోగమును నేర్చుకుని యోగసాధనతో ముక్తిని పొందాడు. సకల వర్ణాశ్రమ ధర్మములను ఒక రాజుగా శాసనముతో ఆచరింపచేసి ఒక యోగిగా తాను ఆచరించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.
సామంతరాజులకు, ఋషులకు, మంత్రులకు, ప్రజలకు చేసిన ధర్మోపదేశము నేటికీ ‘ఋషభోపదేశము’ అను పేరుతో ప్రసిద్ధి. ఈ మహానుభావుడు రాజ్యాన్ని తన పుత్రులకు అప్పగించి అవదూతగా అజగరవ్రతము ఆచరించెను. అజగరవ్రతము అనగా కొండచిలువ వలె ఉన్నచోట నుంచి క దలక దొరి కినపుడు దొరికినంత తినడం. అంటే ప్రతి ప్రాణికి కావాల్సిన ఆహార విహారాలు భగవంతుడే కల్పిస్తాడని నమ్మి ఈ సిద్ధాంతాన్ని వ్రతాన్ని ఆచరించి చూపాడు. అడవిలో కీటకాలు ఒకసారి కురులను, ఒకసారి గడ్డాన్ని, ఒకసారి మీసాలను కొరకగా అదేవిధంగా ఆయన వివిధ రూపాలలో తిరిగాడు. ఏ రంగు వస్త్రం ఇచ్చినా కట్టుకుని భగవంతుడు ఇచ్చినదానితోనే బ్రతకాలని మన ప్రయత్నమంటూ ఏమీ లేదని జీవన సిద్ధాంతాన్ని చాటిచెప్పాడు. తరువాత రాబోయే కలియుగానికి ఇక్కడే బీజాలుపడ్డాయి. ఈవిధంగా ఈయన ఆచరించిన 9 ఆచారాలు వివిధ మతాలయ్యాయి. అడవిలో నిద్రిస్తున్న సమయంలో ఋషభుడు దావాలనం చుట్టుముట్టగా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేయక అందులోనే దహనమయ్యి జీవన వేదాన్ని చాటినవాడు ఋషభుడు.

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement