శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
ఈరోజు దత్తాత్రేయ అవతార వైశిష్ట్యాన్ని గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
దత్తాత్రేయుడు
అత్రిమహర్షి, అనసూయ ఉత్తమ సంతానం కోసం తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి మీ కోరిక మేరకు మేము ముగ్గురము పుత్రలమవుతామని వరమిచ్చారు. బ్రహ్మ అంశంతో చంద్రుడు, రుద్రుని అంశంతో దుర్వాసుడు, విష్ణువు అంశంతో దత్తాత్రేయుడు అవతరించారు. దత్తాత్రేయుడు వేదాంత తత్త్వ శాస్త్రాన్ని అలర్క మహర్షికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఉపదేశించాడు. అలాగే కార్తవీర్యార్జునికి వేయి చేతులను, ఎదురులేని పరాక్రమాన్ని, అఖిల భూమండల ఆధిపత్యాన్ని ప్రసాదించాడు. మోక్షం కోరేవారికి మాత్రమే యోగిగా కనపడాలని, ఇతరులకు భోగిగా కనపడాలని, ప్రపంచంలొనె ఉంటూ ప్రపంచానికి దూరంగా ఉండాలని ఆచరించి ఉద్భోదించిన మహానుభావుడు. దత్తాత్రేయుని ఆశ్రమంలో ఆయన చుట్టూ 4 కుక్కలు, వాటి చుట్టూ 8 మద్యభాండాలు, వాటి చుట్టూ 16 మంది యువతులు, వారి చుట్టూ 32 వివిధ జంతువుల మాంసఖండాలు, వాటి చుట్టూ 64 విలాస భోగ స్థానాలు ఇన్నిటి మధ్యన స్వామి భోగమూర్తిగా వ్యసన లంపటునిగా అజ్ఞానులకు దర్శనమిస్తారు. వాస్తవానికి జ్ఞానులకు యోగులకు 4 కుక్కలు 4 వేదాలు. 8 మద్యభాండాలు అష్ట సిద్ధులు. 16 మంది యువతులు 16 కళలు, 32 జంతువుల మాంస ఖండాలు 32 బ్రహ్మ విద్యలు, 64 వివిధ భోగాలు చతుస్సష్ఠి కళలు ఇది దత్తాత్రేయుని అసలు రూపం. జ్ఞానులకు ఈ విధంగా సాక్షాత్కరించి అజ్ఞానులకు దూరంగా ఉండాలని పైవిధంగా దర్శనమిస్తారు.
నమస్తే భగవ న్ బ్రహ్మ దత్తాత్రేయ మహామతే
అగ్రత: పృష్టత: మహ్యం స్తిత్వ రక్షస్వ సంతతం
సర్వబాధా ప్రశసమనం కురుదేవ పరాత్యుత
ఇది అనవరతం జపించదగిన మంత్రం. ”స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా” అనగా తలచు వారి వెంట నడచువాడు తన భక్తుల కష్టాలను ఉద్ధరించువాడు అని అర్థం. ”దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ నమోస్తుతే ” అని నిరంతరం జపించే వారి వెంట వుండి వారి బాధలు తొలగించి జ్ఞాన దీపాలను వెలిగించే కరుణామూర్తి దత్తాత్రేయుడు.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి