Saturday, November 23, 2024

ధర్మం మర్మం (ఆడియోతో…)

మూషిక వాహన వైశిష్ట్యం..

మూషిక అంటే దొంగలించేది అని అర్థం. మన ఇంట్లో మనం ఉండగా మనం చూస్తుండగానే ఇంట్లోకి వచ్చి తనకు కావలసినదాన్ని తీసుకొని వెళుతుంది మూషికం. మనం దాన్ని ఆపలేము, బయటకి పంపలేము అలాగని పట్టపోతే భూమిని తొలచి లోపలికి వెళ్లిపోతుంది. అంటే రంధ్రం చేసుకొని లోపలికి పోతుంది. మనం ఏమరపోటుగా ఉంటే తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. ఈ శరీరంలో హృదయం అనే బిలంలో స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉండే మూషికం మన మనస్సే. అది మనకు తెలిసే మన జ్ఞానాన్ని మని వివేకాన్ని దొంగలిస్తుంది. కోరికను కలిగించి కోపాన్ని కలిగించి తాననుకున్న పనంతా చేసేస్తుంది. మన ఇంట్లో ఉన్న ఎలుకను పట్టలేము, మన ఒంట్లో ఉన్న మనసును పట్టలేము. గణపతికి వాహనం మూషికం. శరీరానికి వాహనం మనస్సు. శరీరమే గణపతి కావున అది దొంగలించి నపుడే మనసు తన వశం చేసుకుంటుంది. మనం యమ నియమాదులతో మనసును వశం చేసుకుంటే మనను ఉత్తమ లోకాలకు మోసుకుని వెళుతుంది అంటే ఆత్మకు వాహనం అవుతుంది. ఇది మూషిక వాహనంలోని వైశిష్ట్యం.

గణపతి తన దంతంతో మూషికాసురుడిని సంహరించాడు. మూషికము అంటే మనసు. దంతం ఘన పదార్థాన్ని చూర్ణముగా చేసి దానిలోని రుచిని అందించేది, పెంచేది దంతం. అనగా దంతం అంటే రుచి. దంతంతో మూషికాన్ని సంహరించాడు గణపతి. అంటే మూషికాన్ని సంహరించాడు అంటే రుచితో మనసుని లొంగదీసుకున్నాడు. రుచి ఉన్నంత వరకే మనం మనసుకు లొంగుతాము. రుచి వదిలిపెడితే మనసు మనకు లొంగుతుంది. రుచి అంటే ఆశని వదిలిపెడితే మనం మనసు మీద స్వారీ చేయచ్చు అనేది మూషిక వాహన అంతరార్థం.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement