మనకందరికీ మిత్రులు ఉంటుంటారు. చేసిన మేలు మర్చిపోయేవారు, మన అభివృద్ధి చూసి ఈర్ష్యపడేవారు, ఇతరుల గురించి మనతో అసత్యారోపణలు చేసేవారు, ఇలా ఎన్నో స్వభావాలతోఉంటారు. కాని మనలో చాలామంది స్నేహం పట్ల నమ్మకంతో ఉంటుంటారు. అటువంటి వారివల్ల మన ఆలోచనా విధానంలో కూడా మార్పులు సంభవించే అవకాశం లేకపోలేదు. అందుకే మనం వారి పట్ల జాగరూకతతో మెలగాలి. దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తి ఉపకారం పొంది కూడా ఎలా నష్టపోయాడో చెప్పే కథ మహాభారతంలోని ఒక ఉపాఖ్యానంలో ఉంది. అది తెలుసుకుందాం.
కాశ్యప గౌతముడు అనే ఒక బ్రాహ్మణుడు, తన తాత ముత్తాతలనుండి వస్తున్న కులవృత్తిని వదలి, దుర్వ్యసనాలకు బానిసై, ఒక బోయ కులస్థురాలిని వివాహం చేసుకొన్నాడు. భార్యతో కలిసి తనకు విహితం కాని మాంసం, మందు సేవించడం వంటివే సుఖాలుగా భావిస్తూ, డబ్బు సంపాదించడానికి కొంతమంది వ్యాపారస్తులతో కలసి, మరో దేశానికి అడవిగుండా ప్రయాణమయ్యాడు. అడవిలో ప్రవేశించేసరికి చీకటి పడింది. వారంతా ఒక బిడారంలో తలదాచుకొన్నారు. ఒక అడవి ఏనుగుల గుంపు ఆ బిడారంపై దాడిచేసేటప్పటికి, భయంతో అందరూ తలో ప్రక్కకు పారిపోయారు. ఆ స్థితిలో గౌతముడు
కొంతదూరం పారిపోయి, ఒక పెద్ద మర్రి చెట్టు క్రిందకు చేరి విశ్రమించాడు. తెల్లవారగానే, ఆ వ ృక్షం పైనే నివాసముంటున్న ఒక కొంగ ఇతనిని చూసింది. ఆ కొంగకు నాడీజంఘుడు, ధర్మదత్తుడు అనే పేర్లు ఉన్నాయి. నాడీజంఘుడు ధర్మం తెలిసినవాడు. స్నేహశీలి. ఆ విప్రుని ముందుకు వచ్చి, ”ఓ! బ్రాహ్మణోత్తమా! ఏ పనిమీద ఎక్కడకు వెడుతున్నావు? నీ వివరాలు వివరించు. నిన్ను చూడగానే, సంతోషించాను. నువ్వు నాకు అతిథివి” అనగానే, ఆ బ్రాహ్మణుడు తన వివరం ఉన్నది ఉన్నట్టుగానే విశదపరచాడు. (కొంగ మనుష్యభాషలో మాట్లాడటం వంటి సందేహాలు ఇక్కడ పాఠకులకు కలగవచ్చు. అయితే ఇది ఏదో యుగంలోని కథ. ఆ యుగంలో కొన్ని సందర్భాల్లో జంతువులు మాట్లాడేవని అర్థం చేసుకోవాలి). అపుడా కొంగ దగ్గరలోని ఒక చెరువు దగ్గరకు వెళ్ళి, కొన్ని చేపలను పట్టి, కాల్చి తినమని ఇచ్చి వాటితో బాటు అడవి పళ్ళు, మంచినీరు చూపింది. కొంతసేపయిన, అనంతరం నాడీ జంఘుడు మాట్లాడుతూ ”మనిషి పేదరికం పోవ డానికి మంచి స్నేహితుడు, ఆలోచనాసరళి, ధనం, బంగారం ఈ నాలుగు ముఖ్యమని దేవ గురువు బృహస్పతి చెప్పారు. ఇక్కడికి దగ్గరగా మధువ్రజం అనే చిన్న రాజ్యం ఉంది. అక్కడి రాజు విరూపాక్షుడు
నాకు ప్రాణమిత్రుడు. అతని వద్దకు వెళ్ళి, నేను పంపానని చెప్పు. సంతోషించి, నీకు ధనం, బంగారం ఇచ్చిసత్కరిస్తాడు” అని చెప్పి ఆ విప్రుడుని పంపింది. అతను, మధువ్రజం చేరి విరూపాక్షుని కలిసి సంగతి వివరించాడు. విరూపాక్షుడు అతనిని తేరిపార చూసి, మనస్సులో ‘ఈ బ్రాహ్మణుడి మనస్తత్వం పరిశీలించి, నీచుడిలా ఉన్నాడే’ అని భావించి అతని పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని, తన మిత్రుడు నాడీజంఘుడు పంపాడనే సదుద్దేశంతో ధనాన్ని, బంగారాన్ని, రత్నాలను ఇచ్చి పంపాడు. ఆ విప్రుడు ఆ సంపదనంతా సంచులలో నింపి, భుజాన వేసుకొని, ఆయాసపడుతూ, మళ్ళీ మర్రిచెట్టు దగ్గరకు వచ్చి, నాడీజంఘుడికి విషయంచెప్పి, ఆ రాత్రికి విశ్రమించి, మరునాడు పొద్దున్నే వెళ్ళవచ్చు అని ,ఆగిపోయాడు. ఆ రాత్రికి సంపద వల్ల నిద్రపట్టక రేపు దారిలో ఆకలేస్తే తినడానికి ఏముండదని భావించి, నిద్రపోతున్న కొంగను చంపేసి, ఈకలు దూరంగా పారేసి, డొక్కను పారవేసి వెళ్ళిపోయాడు.
అయితే అక్కడ విరూపాక్షుడు తన మిత్రుడు నాడీ జంఘుడు ప్రతీరోజూ వచ్చేవాడు, ఈ రోజు రాలేదేమిటాని ఆలోచించి, తన భటులతో మర్రి చెట్టు వద్దకు వచ్చి, మిత్రుడి జాడ తెలియక, చుట్టూ వెతకమని భటులను ఆజ్ఞా పించాడు. వారు ఆ కొంగ ఈకలు, డొక్కను పట్టుకురాగా, ఆ బ్రాహ్మణుడే ఇంతపని చేసుంటాడని తలపోసి, అతనిని వెతికి తీసుకురండని ఆజ్ఞాపించాడు. ఆ భటులు దూరం ప్రయాణించి, ధనం మూటలతో సహా పట్టుకుని రాజు వద్దకు తీసుకొచ్చారు. అపుడా విరూపాక్షుడు ”వీడు చేసిన మేలు మరచేవాడు.
కృతఘ్నుడు. చంపేయండి” అని ఆదేశించాడు. ఆ భటులు ఆ బ్రాహ్మణుడిని చంపేసారు. రాజు దు:ఖిస్తూ కొంగకు అంతిమ సంస్కారాలు జరిపాడు. అయినా దు:ఖంతో విలవిలలాడుతుంటే దేవేంద్రుడు వచ్చాడు. ఇంద్రుని చూసి విరూపాక్షుడు అంజలి ఘటించి, నా మిత్రుడు అన్ని ధర్మాలు తెలుసున్నవాడు. ధర్మదత్తుని బ్రతికించమని వేడుకొన్నాడు. అతని ప్రార్థన విన్న ఇంద్రుడు ”నీ మిత్రుడు నాడీ జంఘుడు బ్రహ్మకు కూడా మిత్రుడే. రోజూ క్రమం తప్పకుండా అతనని దర్శించేవాడు. బ్రహ్మ దయవల్ల పునర్జీవితు డవుతాడు”అంటూ పేరు పెట్టి పిలిచేసరికి, నాడీ జంఘుడు వచ్చాడు. ఇంద్రుడు మాట్లాడుతూ ”అందర్నీ గుడ్డిగా నమ్మకూ డదు. మంచిచెడ్డలు, విచారించి, ప్రవర్తన పరిశీలించాలి” అని చెప్పి అంతర్థానమయ్యాడు. మనం మిత్రులను కొన్నవారే, ఆపదలు కలుగచేస్తుంటారు. ఈ కలియుగంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూంటాయి.
తస్మాత్ జాగ్రత్త.
ఎ. రంగారావు
79894 62679