సంకట కటై మిటై సబపీరా!
జో సుమిరై హనుమత బలబీరా:!!
స్మరణ మాత్రముననే సమస్త సంకటాలను తొలగించి, అన్ని అననుకూలాలను దూరం చేయగల శంకరాంశ హనుమది. వీరము, బలము, ధైర్యము, బుద్ధి కుశలత, హృదయ సంస్పందన హనుమ గరిమలోని భిన్నపార్శ్వాలు, ఆరాధనకన్నా, హనుమ స్మరణ సులభం. పాండిత్యంతో పనిలేని సహజ క్రతువు. అది మానసికం. కష్టసుఖాలు మానవ జీవితంలో అని వార్యమైనవి. తప్పించుకోలేనివి. కష్టం తొలగితేగాని మనసు ముందుకువెళ్ళదు. సుఖం పరిధి స్వల్పమని, తాత్కాలికమని తెలియనపుడు లాలస విజృంభి స్తుంది. కనుక, కష్టంలో హనుమను స్మరిస్తే దు:ఖ తీవ్రత తగ్గి, మనసు నెమ్మదిస్తుంది. సుఖంలో స్మరిస్తే, కష్టాలన్నీ కర్మ నిష్టలుగా మారి, మానసిక స్థైర్యము, సదవగాహన, జీవితాన్ని సరైన విధానంలో అర్ధం చేసుకుని జీవించగల సమర్ధత ఏర్పడతయ్. ‘విధి లిపి నాశయంతీం’ అంటే విధాత విరచించే తలవ్రాతను, అది కలిగించే సుఖ దు:ఖాలను, వాటి వలన కలిగే ఖేద మోదాలను సమ న్వయం చేయగల ధీశక్తి, హనుమది. హనుమ, సాక్షాత్ రుద్రాంశ కనుక, విధివ్రాతను సంస్కరించగల, పరిష్క రించగల బలము, దయావీరము ఆయన సహజ గుణం.
హనుమ స్మరణ అంటే అనాహత ప్రణవోపాసన!
– వి.యస్.ఆర్.మూర్తి
9440603499