కృత త్రతాద్వాపర యుగాలలో ప్రజలు ధర్మాచరణ చేస్తున్నా, పుణ్యం సంపాదించడానికి, మోక్షాన్ని పొందడానికి, యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు. భగవత్తత్త్వాన్ని తెలుసుకొని, ముక్తి పొందడానికి ”తపస్సే”
ఒక ఆయుధంగా చేసుకొన్నారు. ఆ మహర్షులు అందించిన ఆధ్యాత్మిక మార్గము, ధర్మమార్గములే
నేటికీ మనకు ఆదర్శము. ఈ కలియుగంలో ధర్మం ఒక పాదమే అని వేదం చెపుతోంది. అంటే అధర్మం, అన్యాయం ఎక్కువగా పాలుపంచుకొంటున్నాయి. ఈ తరుణంలో మనకు పుణ్యం సిద్ధించడానికి, మోక్ష ప్రాప్తికిభగవన్నామ స్మరణ, ఆరాధన, దానాలు ఉత్తమమని వేదాలు, పురాణాలలో పేర్కన బడింది. దానం యజ్ఞంతో సమానం. వేదపండితులకు, బ్రా#హ్మణులకు వినయపూర్వకంగా, సద్బుద్ధితో ధన ధాన్య గో భూ అన్నదానాలు వంటివి చేయడం ఉత్తమ కార్యం. పితృకార్యాల సమయంలో ”దశదానాలు” కర్తలచేత చేయి స్తుంటారు. మరణించిన జీవికి, అంతకు ముందు తరంలోని పితృదేవతలు ఉత్తమగతులు పొందడానికి ఇవి చేయిస్తుం టారు. ”శిబి” చక్రవర్తి తన అవయవాలను దానం చేసి ఖ్యాతి పొం దాడు. కాశీని పాలించిన రాజు ప్రతర్థునుడు తన నేత్రాలను ఒక విప్రుడికి దానం చేసేడు. కాశ్యపుడ, గయుడు, జనకుడు, పర శురాముడు ఇలా ఎంతో మంది దానాలు చేసి ఆదర్శప్రాయు లైనారు. ఈ రోజు భూదానం, అన్నదానం, తిలాదానం గురించి తెలుసుకొందాం.
భూదానం చాలా విశిష్టమైంది. జీవులందరికి ఆహారం, పండ్లు, జలాన్ని అందించేది భూమాతయే కదా!
పంచభూతాలలో ఒకటైన భూదానం చేయడం వల్ల భూమి ఎంతకాలం ఉంటుందో, అంతకాలం దాత స్వర్గలోకంలో నివసిస్తాడు. బ్రహ్మ హత్యాదోషాలు నశిస్తాయి. భూదానం అశ్వమేధయాగంతో సమానమని మహర్షులు వివరించారు. భూదేవిని రత్నగర్భ అంటారు. మన దేశాన్ని పాలించిన రాజులు, మన పూర్వీకులుఎంతోమంది దేవాలయాల పోషణార్థం, విద్యాలయాల నిర్మాణం నిమిత్తం, విశేషమైన భూదానాలు చేశారు. ఆఘనత మనకు ఉంది. అయితే దానం చేసిన భూమిని ఆ వంశీయులు వెనక్కుతీసేసుకొన్నా, అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నా, అటువంటి వారి వంశంలో పది తరాలవరకు నరకంలో పడేటట్లుచేస్తుంది. దానం చేస్తానని వాగ్దానం చేసిన భూమిని దానం చేయక పోతే మహాపాపం అంటడమే కాదు. బ్రహ్మ హత్యాదోషం వస్తుంది. ఇటీవల కాలంలో దేవాలయాల భూములు. అన్యాక్రాంతం అవుతున్న సంగతి మనకు తెలుసున్నదే!
వేదంలో అన్నం పరబ్రహ్మస్వరూపంఅని ఉంది. భగవద్గీతలోని మూడవ అధ్యాయంలో”అన్నాద్భవంతి భూతాని” అని పేర్కొనబడింది. అంటే అన్నం నుండే సకలభూతాలు పుడుతున్నాయని. అన్నం ప్రాణాధారం. అందుచేత అతిథులకు,మనల్ని ఆశ్రయించి ఉన్న పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించడం మన కర్తవ్యం. తాపసులకు, వృద్ధులకు, పిల్లలకు, అనారోగ్యంతో ఉన్నవారికి, స్త్రీలకు ఆహారాన్నిఅందించి ఆదరించాలి. పితృదేవతలను, దేవతలను అన్నదానంతో సంతోషపెట్టడం, శ్రేష్ఠకర్మ అంటారు. అన్నం సప్తధాతువులను పోషిస్తుంది. నిరతాన్నదాత తూ.గో.జిల్లా అమలాపురం ప్రాంతంలోని లంకల గన్నవరం గ్రామానికి చెందిన డొక్కా సీతమ్మ గురించి తెలియని ఆంధ్రుడు ఉండడు. తనకున్న దాంట్లో లేదనకుండా అన్నదానం చేసిన త్యాగశీలి. అన్నదానం చేయడానికి ఇక ఏమీ లేవని, ఎవరైనా వస్తే ఊరికే పంపడం ఇష్టంలేక, దిక్కుతోచక, గ్రామాంతరం వెళ్ళిపోదామని బట్టలు పట్టుకొని గోదావరి రేవుకు చేరారా దంపతులు. అటువైపు నుండి వస్తున్న పడవలో పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే, తల్లిదండ్రులు ”ఇక వచ్చేసాము. ఆ అన్నపూర్ణమ్మతల్లి సీతమ్మగారు మీకు అందరికీ అన్నం పెడతారు” అని ఓదారుస్తూ చెప్పిన మాటలు ఆవిడ చెవిన పడగానే, వెంటనే వెనక్కివచ్చి అమ్మడానికి ఏముందా అని చూసి దొడ్డిలోని రుబ్బురోలు దొర్లించే టప్పటికి దాని క్రింద వజ్రవైడూర్యాల మూట కనపడింది. దైవం ఆమె చేసే నిరతాన్నదానానికి హర్షించి కొనసాగించమనే అలా చేసాడని పదిమంది చెప్పుకొనేవారు. ఇక తిలాదానం పితృకార్యాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. పితృదేవతలకు తర్పణాలు వదలడానికి బ్రహ్మ తిలలను సృష్టించాడు. దానివల్ల పైలోకంలో ఉన్న వారికి ఆహారాన్ని అందించినట్లు. మధ్య భారతదేశంలో పర్షశాల అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అనేక మంది వేదపండితులు ఉండేవారు. వారిలో శర్మి అనే బ్రాహ్మణుడితో యముడు ”అన్ని దానాల్లో తిలాదానం కూడా విశిష్టమైనదే. మీ పితృదేవతల సంతుష్టి గురించి తిలాదానం చేయ”మని సూచించాడు. ఆ విప్రుడు అలాగే తిలలు దానం చేశాడు. నవగ్రహాలలో శని గ్రహ ప్రీత్యర్థం తిలలే దానం చేస్తూంటారు కదా! కాబట్టి మనం మన కున్న పరిధిలో శక్తిమేరకు దానాలు చేసి పుణ్యాన్ని పొందుదాము.
డా.సిహెచ్.బాబావలిరావు
హైదరాబాద్, 99897 92247