మానవుడు అనాదిగా ఈ చుట్టూ ఉండే ప్రకృతిలోని గాలి, నీరు, నిప్పు, భూమి మొదలైన తత్త్వాలపట్ల ఒక అంతర్గతమైన భీతి కలిగి ఉన్నాడు. అతి ప్రాచీన కాలంలో ఈ పంచభూతాల మూలంగా ముఖ్యంగా పైన చెప్పిన గాలి మొదలైన తత్త్వాల మూలంగా ఏర్పడుతున్న విలయాలకు ప్రతిసమాధానం దొరక్క, వాటిని నియమించగల శక్తి తనకు లేక వీటిని అదృశ్యదైవతా శక్తులుగా ఉపాసించడం ప్రారంభించాడు.
ఈ ధోరణి ఈనాడు కూడా ఈ ఆధునిక సమాజంలోనూ కొనసాగుతోంది. ప్రాకృతిక తత్త్వాల మూలంగా అంటే గాలి, నీరు, నిప్పు, భూమి మూలంగాను ఆకాశంలోని గ్రహనక్షత్రాదుల మూలంగాను తాను ఎదుర్కొంటున్న ఉపద్రవాలకు ప్రతిచర్య చేయగల సామర్థ్యం తనకులేదని దృఢంగా ఆధునిక మానవుడు కూడా గుర్తించాడు. తాను తుఫానులను ఆపలేడు, సునామీలను నిలువరించలేడు, అగ్ని విలయాలను అడ్డుకోలేడు, ఆకాశం నుంచి పడే గ్రహశకలాలు ఉల్కలు మొదలైన వాటి నుంచి, సూర్యాదుల తీవ్రత నుండి, తనను తాను రక్షించుకోలేడు. శీతోష్ణాల సమతుల్యం దాటితే తట్టుకోలేడు. కనుక వీటికి ఎప్పటికైనా దాసోహమనకతప్పదు. మహామునులు మాత్రమే తమ తపస్సు చేత వీటిని అడ్డగల్గినట్లు పురాణతిహాసాలు వ్రాశాయి. ఈనాడు అది మానవునికి సాధ్యం కాదు. కనుక ఈ అశక్తతయే ఈ ప్రకృతిని అదృశ్యశక్తిగా ఉపాసించే స్థితికి తీసుకొనివెళ్ళింది.
ఈ ప్రకృతి మూలంగా తాను ఎదుర్కొనవలసిన దుష్పలితాల మూలంగానే కాక, ప్రకృతిని తాను సరిగా అర్థం చేసుకోలేక, దాన్ని వినియోగించుకోవడంలో ఏర్పడిన దుర్భావన వల్ల, కూడా ఈ ప్రతిలోని ప్రతీ వస్తువు తన భోగానుభవానికేనని భావించి భంగవడ్డాడు మానవుడు. నీటిని ప్రాణం నిలుపుకోవడానికి కావలసినంత వినియోగంచుకొని బ్రతకగలడు కానీ పరిమితి మీరితే మరణం తప్పదు. అలాగే వాయువు, అగ్ని కూడా వాటి సహజస్థితికి భంగం కలిగించి, తన భోగానికే వినియోగించుకొనే స్వార్థం ప్రబలినకొలదీ, తన బ్రతుకుకు కారణమైన వీటివల్లనే, తాను నశించే స్థితికి చేరుతాడు మానవుడు.
ఈ దశలో ఈ ప్రకృతిని ఏదో ఒక అదృశ్య శక్తి నడుపుతోందనే విశ్వాసం దృఢపడి ‘శక్తి’ ని ఉపాసించడం ప్రారంభించాడు. చెట్టు, పుట్టలు, రాళ్ళు, కొండలు, నదులు, వీటన్నిటినీ ప్రకృతి పట్ల గల భయంతోనే మానవుడు ఆరాధించడం ప్రారంభించాడు.
ముఖ్యంగా వసంతకాలం, శరత్‌కాలం ఈ రెండు కాలాల్లో ప్రకృతి తన అందాలను చూపి, ఇతర ప్రాణులను ఆకర్షించి తన వలలో పడేలా చేస్తుంది. దీని రహస్యం ఎరిగిన మహర్షులు దీని వలలో పడరు. మానవునితో ప్రకృతి పట్ల గల భయంచేత ఏర్పడిన శక్తి ఉపాసనమే నేడు ‘దసరా’ గా ప్రసిద్ధి చెందింది. పదిరోజులు ‘దశఅహ:’, ‘దస్ అహర్’, దసరా అయింది. వసంతం, శరత్ అనే కాలాలను యముని కోరలుగా పురాణాలు పేర్కొన్నాయి. కనుక, ప్రకృతి ఉపాసనకు కాలాలే ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రకృతి శక్తి ఉపాసన పదిరోజులు సాగుతుంది. పదిరోజులు పదిపేర్లు పెట్టి, పది రకాల అలంకారాలతో ఆ శక్తి ప్రతిమను అలంకరించి పూజించడమే దసరా నవరాత్రులు. వసంతకాలంలో ఇలానే వసంత నవరాత్రులు చేస్తాం.
ప్రకృతి శక్తికి ఒక మూర్తి కల్పనం దాని పూజించడం ద్వారా, దీని మూలంగా తన కెలాంటి ఉపద్రవాలు కలుగరాదని ఆశించడమే లక్ష్యం. ఈ శక్తి ఆరాధనం వేరు వేరు స ంప్రదాయాల్లో వేరువేరుగా సాగుతుంది. సంప్రదాయానుగుణంగా పేర్లు పెట్టి వ్యవహరించడం వివిధ విధానాల్లో వివిధ వస్తువులు వినియోగించి పూజించడం ఉంటుంది.
-డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్యులు…
ఎకడమిక్ డైరక్టర్ – జీవా