Friday, November 22, 2024

దయగల హృదయమే దేవాలయం!

ఒక ప్రాణికి ఏదైనా కష్టం కలిగితే మన మనసులో కలిగే దు:ఖాన్నే ‘దయ’ అంటారు. ధర్మము నాలుగు పాదాలలో ‘దయ’ ఒకటని భాగవతం చెబుతుంది. ఇతర ప్రాణి కష్టం చూసి మనకు దు:ఖం ఎందుకు కలగాలి? అని ప్రశ్నించుకొంటే అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే అనే సమాధానం చెబుతారు వేదాంతులు. ”ఆత్మ వృత్‌ సర్వ భూతాని”, ”మా మాత్మా సర్వ భూతాత్మా” అనే శాస్త్ర వచనాలు దీనిని సమర్థిస్తున్నాయి. దయాగుణం కల వాడు ధర్మమార్గంలో నడుస్తాడు. నిర్దయుని వలన సమాజానికి చేటు కలుగుతుంది. జగద్గు రువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి మహనీ యుల జీవితాల్లో దయారసం వెల్లివిరిసింది. సామాన్యులకు ఎందరికో మార్గదర్శకమైంది.
దయ కలిగిన మనిషి పరోపకారం చేయడమేగాక, తనకుతాను మనశ్శాంతిని, సమతు ల్యతను పొందుతాడు. ఒకసారి మదనమోహన మాలవ్యగారు పనిమీద వెళ్తూ దారిలో ఒక కుక్క తన చెవికి అయిన గాయం వలన బాధతో అరుస్తూ అటుఇటు తిరుగుతూ ఉండడం చూసి కలత చెందారు. దగ్గరలో ఉన్న ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించి ఏదైనా మందు ఇవ్వమని అడిగారు. డాక్టర్‌ గారు ”కుక్కకు మీరు మందు రాసే సమయంలో అది మిమ్మల్ని కరిస్తే మీకే ముప్పు కలుగుతుంది. దానిని రక్షించే ప్రయత్నం మానుకొమ్మ”ని చె ప్పారు. అప్పుడు మాలవీయ గారు నా ప్రాణ రక్షణతోబాటూ ఆ జీవికి బాధనుండి ఉపశమ నం కలిగించడమూ ముఖ్యమే కదా! దయచేసి ఏదైనా మందు ఇవ్వమని ప్రార్థించి, వైద్యుడి చ్చిన పూతమందును ఒక పొడుగాటి బెత్తానికి దట్టించి కుక్క వైపు వెళ్ళారు. మొదట భయం తో కుక్క మొరిగింది. కానీ మాలవీయ మెల్లగా దానిని లాలించి, దాని చెవికి ఆ మందు రాశా రు. కొంతసేపటికి కుక్క నొప్పి తగ్గి, కృతజ్ఞతతో తోక ఆడిస్తూ ఆయన వద్ద నిలిచింది.
ఒకసారి అబ్రహాం లింకన్‌గారు ఆఫీస్‌కు వెడుతుండగా ఒక మురికి కాలువలో ఒక పం ది చిక్కుకొని, బయటకు రాలేక అవస్థపడటం గమనించారు. తమ వాహనాన్ని ప్రక్కన ఆపి, కాలువలోకి దిగి, ఆ పందిని తమ చేతులతో ఎత్తుకొని, పైకితీసి రక్షించారు. అయితే ఆయన బట్టలకు బురద అంటుకొని పాడైపోయాయి. ఇది చూసిన ఒక వ్యక్తి ”పోనీలెండి. ఆ పంది బాధను మీరు పోగొట్టారు” అన్నాడు. అబ్రహాం లింకన్‌ చిరునవ్వుతో ”దాని బాధను కాదం డీ. నా మనసులోని బాధను పోగొట్టుకొన్నాను” అన్నారు. ‘అహమాత్మా సర్వత్ర’ అనే మాట కు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. ప్రాణులన్నింటిలో ఉండే ఆత్మ ఒక్కటే అని భావిం చి, ఇతరుల సుఖసౌఖ్యాలను, ఆనంద సౌభాగ్యాలను తనవిగా భావించి సంతోషపడేవారు అరుదుగా ఉంటారు. కఠోర సాధనతోనే సమదృష్టి, దయామయ హృదయ బంధం ఏర్పర చుకోగలిగేవారు కొందరు, ఆ సుగుణాలు సహజముగా ఉన్న మహాత్ములు మరికొందరు.
కలకత్తా నగరంలో సుప్రసిద్ధ విద్వాంసులైన విశ్వనాథ తారక భూషణ్‌గారు ఒకసారి తీవ్రమైన జ్వరంతో మంచం పట్టారు. ఆయనను పరీక్షించిన వైద్యుడు ఆయన జ్వరం తగ్గడా నికి మందు ఇస్తాను కానీ, మీరు ఇతనికి ‘దాహం అవుతోంది, నీళ్ళు ఇమ్మని అడిగితే ఎట్టి పరి స్థితులలోనూ మంచినీళ్ళు ఇవ్వకూడదని, నీళ్ళు తాగితే ఆయన దక్క’డని చెప్పి, ఔషధము ఇచ్చి వెళ్ళాడు. తారక భూషణ్‌ ఔషధం సేవించాక, దాహంతో అలమటిస్తూ నీరు ఇవ్వమని ఎంత వేడుకొన్నా బంధువులు నీరు ఇవ్వలేదు. అప్పుడాయన, అంత జ్వర తీవ్రతలో కూడా ఇలా ఆలోచించారు. అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే అంటారు కదా. ఈ విషయాన్ని పరీక్షించే సమయం వచ్చింది. నాలోనూ, అందరిలోనూ ఒకటే ఆత్మ ఉంటే, ఇతరులు నీళ్ళు త్రాగడం చూస్తే నాకు కూడా దప్పిక తీరాలని అనుకొని తన వారిని దగ్గరకు పిలిచి, బయట వెళ్ళే ఎవరైనా వ్యక్తిని పిలిచి అతనికి పండ్లరసం ఇవ్వమని కోరాడు. బంధువులు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి పండ్లరసాన్ని ఇచ్చారు. ఆ వ్యక్తి దానిని తాగి తృప్తిగా వెళ్ళాడు. ”అమ్మయ్యా! ఇప్పుడు నా దప్పిక తీరింది. జ్వరం కూడా తగ్గింది” అని పడకపై నుండి విశ్వనాథ తారక భూషణ్‌గారు లేచి కూర్చొన్నారట. అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే అనే భావన త్రికరణశుద్ధిగా ఒంటబట్టించుకొంటే దయాగుణం పెంపొందుతుంది. ఇతరుల సుఖాన్ని చూస్తే ఆనందం, వారి కష్టాన్ని చూస్తే దు:ఖం కలగడానికి కారణం ”ఆత్మైకత్వమే” అంటారు పి.లక్ష్మీకాంతం.
అన్ని ప్రాణులలో ఉన్నది ఒక్కటే ఆత్మ అన్న మహనీయుల మాటలను విశ్వసించడమే కాక, ఆ భావాన్ని తమ అనుభవంలోకి తెచ్చుకొని, ఆచరించి చూపిన వారు ఎందరో ఉన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యులలో ఎన్నదగిన వారు నాగ మహాశయులు. ఒకమారు ఆయ న నడుచుకొంటూ వెడుతుండగా దారి ప్రక్కన ఒక వ్యక్తి బుట్టనిండా చేపలు తెచ్చి అమ్ముతు న్నాడు. అందులో చాలా చేపలు జీవంగా ఉండి ప్రాణం కోసం గిలగిలా కొట్టుకొంటున్నా యి. వాటిని చూసి నాగమహాశయునికి దు:ఖం కలిగింది. వాటిని కాపాడాలని నిశ్చయించు కొని ఆ బుట్ట మొత్తాన్ని కొనుక్కొని, తలపై పెట్టుకొని వడివడిగా నడవసాగాడు. చుట్టూ ఉన్న వారు ఈ స్వామి ఇన్ని చేపలను ఏం చేసుకొంటాడు. వండుకొని తినడానికా లేక లాభానికి ఎక్క డైనా అమ్ముకోడానికా అనుకొంటూ ఆయన వెనుకనే నడిచారు. నాగమహాశయుడు నదీ తీరాన్ని చేరి ఆ బుట్టలోని చేపల్ని నదిలో గుమ్మరించాడు. అతని అమాయకత్వానికి అక్కడ ఉన్నవారంతా నవ్వుకొన్నారు. కానీ వారికి నాగమహాశయుని సర్వాత్మభావం అర్థం కాలేదు. దయామయుడైన ఆ మహాశయుడు మాత్రం ఆనందంగా అక్కడనుండి వెళ్ళిపోయాడు.
సకల ప్రాణుల పట్ల సమదృష్టి, వాటి కష్టనష్టముల పట్ల అపారమైన జాలి, దయ కలిగి, మూగప్రాణులను కూడా ఆదరించి, ప్రేమించిన మరొక్క మహోన్నత మూర్తి భగవాన్‌ శ్రీ రమణ మహర్షి. శ్రీరమణులవారు ఒకనాడు ఆశ్రమంలో మౌనంగా కుర్చొని భక్తుల విన్నపా లు వింటున్నారు. ఇంతలో ఒక తల్లి కోతి తన పిల్లను కడుపునకు కరచుకొని మహర్షి దగ్గరగా వచ్చింది. అది స్వామికి హాని చేస్తుందేమో అనే ఉద్దేశముతో అక్కడ ఉన్నవాళ్ళు దానిని తరు మబోయారు. అప్పుడు రమణ మహర్షి వారిని వారించి ”ఆగండి. ఆమెను (కోతిని) ఉండని వ్వండి. మీలాగే ఆమె కూడా తన బిడ్డను నాకు చూపించి ఆశీస్సులు అందుకోవాలని వచ్చిం ది” అన్నారు. అప్పుడప్పుడు అడవి జంతువులు, నెమళ్ళు, ఉడుతలు, పాములు కూడా ఆయన వద్దకు వచ్చేవి. వాటిని చూచి భయంతో వాటిని చంపడమో, తరమడమో చేయాలని ప్రయత్నించే భక్తులను రమణులు వారించేవారు. ఈ అరుణగిరి ప్రాంతంలోని అడవి అంతా ఆ వన్య మృగాలదే. వాటి స్థలాన్ని మనం ఆక్రమించుకొని నివసించడమేకాక, వాటిపైనే దౌర్జ న్యానికి దిగడం అధర్మం అనేవారట ఆయన. ఇలా సాటి మనుష్యులలోనే కాక, పశుపక్ష్యాదు లలోనూ, వృక్షాలలోనూ, సర్వ వస్తువులలోనూ, ఒకే ఆత్మను దర్శించిన ఆత్మజ్ఞాని ఆయన.
అందరిలోనూ దయాగుణం పెంపొందింపబడటానికి ఆత్మజ్ఞానమే ఉండాలనే నియ మం లేదు. సామాన్య మానవులలో కూడా దయ అనేది సహజంగా ఉంటుంది. అయితే అన్నింటిలోనూ తననూ, తనలోనే అన్నింటినీ దర్శించగలిగిన వారిలో ఉండే దయా గుణం ఎప్పటికీ నశింపదు. సామాన్యులలో గల దయకు జ్ఞానం తోడైతే ధర్మపరులను, దయాగుణ సంప న్నులను చేస్తుంది.
దయాహృదయులు సకల ప్రాణకోటికీ చుట్ట మువంటి వారే కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement