Saturday, November 23, 2024

త్రిభువన పావని గంగామాత

శ్రీ ప్లవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి గంగాదేవి జన్మించిన తిథి. అంటే గంగా జయంతి. కొన్ని ప్రాంతాల్లో 18వ తేదీనే జరుపుకుంటారు. తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహాత్మ్యము గ్రంథంలో మన పుణ్య నదుల గురించి కుమారస్వామి అగస్త్య మహామునికి చెప్పిన సందర్భాన్ని సీస పద్యంలో వర్ణిస్తూ”మిన్నేటి పాటియు” అంటూ ఆకాశగంగ అధిక్యతను చెబుతాడు.
గంగానది హిమాలయ ఉత్తుంగ పర్వత శ్రేణుల నుంచి అవత రించిన గంగ భరత ధరిత్రినిపావనం చేసి తూర్పు సముద్రంలో సం గమించింది. గంగా నదిలో స్నానం చేయడం, గంగాజలాన్ని త్రాగ డం పుణ్యమని భారతీయుల విశ్వాసం. ఇందువల్ల సమస్త పాప ప్రక్షాళనం జరుగుతుందని నమ్మకం.
గంగా పాపం శశీ తాపం దైన్యం కల్పతరుస్తథా
పాపం తాపం దైన్యం చహంతి సంతో మహాశయా
గంగానది పాపాన్ని పోగొడు తుంది. చంద్రుడు తాపాన్ని పోగొడ తాడు. కల్పవృక్షం దారిద్య్రాన్ని పోగొ డుతుంది. గొప్ప ఆశయాలు కలిగిన సజ్జనులు పాపాన్ని, తాపాన్ని, దారి ద్య్రాన్ని, మూడింటిని పోగొడతారు. గంగానది అంత పవిత్రమైన నది. ముం దుగా భౌగోళికంగా ఈ నది గురించి తెలుసుకుందాం. ఈ నది హిమాల యాల్లో గంగోత్రి అను చోట పుట్టింది. పర్వతాల మీదుగా ప్రవహిస్తూవచ్చి హరిద్వార్‌ వద్ద మైదాన ప్రదేశంలొ ప్రవేశిస్తుంది. వైష్ణవులు హరిద్వార్‌ అని శైవులు హర ద్వారమని అంటారు. గంగానది ఉత్త రాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల గుండా ప్రవహించి కలకత్తా దగ్గర సముద్రంలో కలుస్తుంది. సముద్రమ ట్టానికి 13,800 అడుగులఎత్తు నుండి ఈ నది ప్రవ హస్తూ వచ్చింది. భాగీ రథి, అలక నంద, మందాకిని అనే ఉపన దులు (పాయలు) కూడా వచ్చి కలి సాయి. దానితో ఈ నది వెడల్పు విపరీ తంగా పెరిగింది. ప్రయాగ్‌ రాజ్‌ (అల హాబాద్‌)లో యమునా, సరస్వతీ నదులు కలుస్తాయి. అయితే సరస్వ తీనది అంతర్లీనంగా గంగలో కలు స్తున్నదని ప్రజల విశ్వాసం. అక్కడ దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. గండకి, సోని, రామగంగ, గోమతి, తమసా, కూసి, శోణ భద్ర, సరయు, ఈ నది ఉపనదులే.
ఈ నది కేవలం భూలోకంలోనే కాక స్వర్గ పాతాళలో కాల్లోను ఉందంటారు. దీనిని స్వర్గంలో మందాకిని అని, పాతా ళంలో భోగవతిగా పిలుస్తారని పురాణ వాక్యం. ఇక్ష్వాకు వంశ జుడు భగీరథుని ప్రయాస ఫలితంగా గంగ దివి నుండి భువికి దిగి వచ్చింది. కావున భాగీరథి అని కూడా పిలుస్తారు. గంగానది (దేవి) సాక్షాత్తు విష్ణు పాదాల నుండి పుట్టింది. అం దువల్లే దీనిని విష్ణు పాదోద్భవి అంటారు. విష్ణ్వాలయాలలో తీర్థం ఇస్తూ ”విష్ణు పాదోదకం పావనం శుభం” అంటారు పూజారులు. నీటిని కూడా గంగ అంటారు. ఏ నీటితో ఎక్కడ స్నానం చేసినా మూడు మార్లు ”గంగ, గంగ, గంగ” అంటూ తలమీద పోసు కుంటే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం అంటారు.గంగాదేవి నివాసం శివుని జటాజూటంలో. ఒక మారు నీటికి కరువు వస్తే శ్రీనాధుడన్నట్లుగా ఒక చాటువు ఉంది. భాగ్యవం తుడైన శ్రీకృష్ణుడు పదహారువేల గోపికలను పెళ్ళాడినా అది అతనికే చెల్లింది. భిక్షమెత్తుకునే నీకు ఇద్దరు పెళ్ళాలెందుకు గంగను విడువు నీకు ఒక్క పార్వతి చాలును అంటాడు. ఈ చాటువులో ఎలా ఉన్నా శివుడు గంగాధరుడే కాని గంగాపతి కాదని విజ్ఞులు చెబుతారు.ఇక వైశాఖ శుద్ధ సప్తమి గంగా జయంతి ఎలా అయిందనే దాని గురించి తెలుసుకుందాం.
భగీరథుని విశ్వ ప్రయత్నం కారణంగా గంగ శివుని జటా జూటంలోకి వచ్చింది. శివుని అనుమతి ప్రకారం శివుడి జటా జూటం గుండా గంగ ఒక పాయ వచ్చింది. అయితే భగీరథుడి కష్టాలు తీరలేదు. భగీరధుడి వెంట వస్తున్న గంగ జ#హ్ను ముని ఆశ్రమాన్ని ముంచెత్తింది. ఆయన తన తపోబలంతో గంగను అదృ శ్యం చేసాడు. భగీరధుడు ప్రార్ధించగా తన కుడి చెవిలోంచి గంగా నదిని వైశాఖ శుద్ధ సమ్తమి నాడు వదిలాడు. అలా గంగానది జాహ్నవి అయింది. తన విభూతులలో జాహ్నవి కూడా ఒకటి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ.
గంగ పూజ
గంగా సస్తమి రోజున గంగను షోడశోపచారలతో పూజించాలి. కాశీకి వెళ్లిన వారు రాగి కలశాలతో తెచ్చుకుంటారు. అవి లేనివారు ఏదైనా నీటి పాత్రలోకి గంగను ఆవాహనం చేసి పూజించవచ్చు.
ఈ పర్వదినాన్ని గంగాజయంతి అంటారు.
గంగ గురించి చాలా విశేషాలు ఉన్నాయి. న గంగా సదృశం తీర్థం. న దేవ: కేశవాత్‌ పరం. గంగ వంటి తీర్థం లేదు. కేశవుని కంటే దైవం లేడు అంటారు. శివుడు గరళాన్ని కంఠంలో ఉంచుకొని నీలకంఠుడు అయ్యాడు. గంగను శిరస్సున ఉంచుకొని గంగాధరుడయ్యాడు.
భీష్ముడి కన్నతల్లి గంగాదేవి. అందుకే అతడిని గాంగేయుడం టారు. పవిత్రమైన గంగానది ఒడ్డునే కాశినగరం వెలసింది. విశ్వ నాథుడు అక్కడ వెల్లివిరిసాడు. కాశీపట్టణంలో విశ్వేశ్వరుని మ్రోల విర్రవీగుతూ
పరవళ్ళు తొక్కుతుంది గంగామాత. కాశీలో గంగా స్నానం చేస్తే కోటి జన్మల పాపాలు పోతాయి. మనకొక సామెత ఉంది ”కాశికి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు తిరిగిరాడు” అని. అంటే వాహనాలు, రోడ్లు లేని ఆ రోజులలో కూడా వ్యయప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాలనుంచి కాలినడకన భక్తులు అక్కడికి వెళ్లి వచ్చేవారు. ఈ మధ్యలో అడవుల మద్య నుంచి ప్రయాణాలు వంటి వాటిలో క్రూర మృగాలు, దొంగలు వంటి ఎన్నో ప్రమాదాలు ఎదురు కావచ్చు. కనుక అలా అనేవారు. ఒక్క కాశి, ప్రయాగలే కాదు గంగా నది పరీవాహక ప్రాం తంలో అనేకా నేక మందిరాలున్నాయి. గంగానది ఒక్క పవిత్రతకే కాదు మాన వాళి బ్రతుకునకు, అవసరమైన పాడి పంటలకు నిలయం.
గంగాజలం అతి పవిత్ర మైనది. ఎన్నాళ్ళు నిలువ వుంచినా పాడవదు. అటువంటి ఆ పవిత్ర గంగాజలం ప్రస్తు తం కలుషితం అవుతున్నది. కర్మాగారా లలోని రసాయ నాలుకలిసిన వ్యర్ధజలా లను, మురికి కాలువ వలలోని కుళ్ళునీటిని శుద్ధి చేయకుండా గంగా నదిలో వదులుతున్నారు. స్వచ్ఛ గంగా ప్రాజెక్టు కింద ఎన్నివేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల ఉదాసీనత కారణంగా గంగా నది తన పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. భారతీ యులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గంగా మాతను కాపాడుకోవాలి.

-గుమ్మా ప్రసాదరావు (భిలాయ్‌)
93405 26220

Advertisement

తాజా వార్తలు

Advertisement