Tuesday, November 26, 2024

త్రిజట స్వప్నం… శుభ శకునాలు

రావణుడి ఆజ్ఞానుసారం, రాక్షస స్త్రీలు, సీత దగ్గరకు చేరి, అనేక రకాల కఠినమైన మాటలన్నారు. ఏకజట, హరి జట, ప్రఘస, వికట, దుర్ముఖి, వినత, అసుర, చండోదరి, అజాముఖి, శూర్ఫణక అనే రాక్షస స్త్రీలు రావణుడి బలపరాక్ర మాలను పొగిడి అతడి ఇల్లాలివై సంతోషించమనీ, రారాజును, దేవ తల విరోధిని, రావణుడిని భర్తగా చేసుకుని సుఖపడమని హితబోధ చేశారు. నయ వాక్యాలతో సీతను ఒప్పించ లేకపోయిన రాక్షస స్త్రీలు, బెదిరింపు మాటలన్నారు. తనను పరుష వాక్యాలతో బాధిస్తున్న రాక్షస స్త్రీలతో, తన మనసులోని మాటలను చెప్పసాగింది సీత.
”ఓ రాక్షస స్త్రీలారా! మీరు చెప్తున్న మాటలు లోకం మెచ్చేవి కావు. మీకు ఘోరపాపాన్ని కలిగిస్తాయి. మనుష్య స్త్రీ, రాక్షసుడి భార్య కావడం ఎక్కడైనా జరిగిందా? చెడుమాటలు మానేయండి. నా మగడే నాకు గొప్ప” అంటుంది సీత రాక్షస స్త్రీలను వుద్దేశించి. సీతాదేవి అన్న మాటలకు ప్రత్యుత్తరంగా, రావణుడిచే ఆజ్ఞాపించ బడిన రాక్షస స్త్రీలు, కఠిన వాక్కులనే బాణాలతో ఆమెను నొప్పించ సాగారు. ఆ మాటలకు, శోకంతో కన్నీళ్లు కారుతుంటే, భయంతో లేచి శింశుపావృక్షం చాటుకుపోతుంది సీతాదేవి.
శింశుపావృక్షం మీద కూర్చుని రాక్షస స్త్రీలు జానకిని బెదిరించడం విన్నాడు హనుమంతుడు. రావణుడు రాకముందే తాను చూసిన స్త్రీని సీతాదేవిగా నిర్ణయించుకున్న హనుమంతుడు, సీతా- రావణుల సంభాషణ వల్ల, తన నిర్ణయాన్ని స్థిరపర్చుకున్నాడు.
ఈవిధంగా రాక్షస స్త్రీలు బెదిరిస్తూ మాట్లాడుతుంటే, సీతాదేవి ”రామా” అంటూ ఏడ్చింది. లంకలో వున్న సీతాదేవి రాక్షస స్త్రీలతో పడ్డ బాధల్లాంటివే, దేహంలోని ”బద్ధ³జీవుడు” సంసారమనే ఇంద్రి యాలతో పడే బాధలు. రావణుడు కానీ, రాక్షస స్త్రీలు కానీ, సీతను బెదిరించారే కాని, చంపలేకపోయారు. అదేవిధంగా, ”జీవాత్మ”ను ఏవీ చంపలేవు. బాధించగలుగుతాయి. సీతాదేవిలాగా బద్ధజీవులు ”ప్రారబ్ధ”మని, దృఢ చిత్తంతో, భగవంతుడే రక్షిస్తాడని అమిత విశ్వాసంతో వుండాలి. సీతాదేవి ఇంద్రియాలకు లోబడలేదని, భగ వంతుడి మీదే విశ్వాసం వుంచిందని దృఢ పడ్తున్నది.
సీత ఇంకా ఇట్లా అనుకుంటుంది తన మనస్సులో: ”శ్రీరామ చంద్రుడి దర్శనం లేకపోవడం అటుంచి, రాక్షస స్త్రీలకు వశపడి బాధపడాల్సి వచ్చింది కదా! నేను ఇంకా మరణించక ఎందుకు ప్రాణం నిల్పుకున్నాను? నా పాపమే కారణమా? ఇంత మహా దు: ఖాన్ని అనుభవించడానికి పూర్వజన్మలో నేనెంత ఘోరపాపం చేసా నో? ఈవిధంగా మూర్ఖపు రాక్షస స్త్రీలు కావలి కాస్తుంటే ఎక్కడో వున్న రాముడు రావడమేంటి? నన్ను రక్షించడమేంటి? కాబట్టి మృత్యుదేవతే నాకు దిక్కు.”
శ్రీరాముడిని తలచుకొని దు:ఖించిన సీత, రాక్షస స్త్రీల పైన తన కోపాన్నీ, అశక్తతనూ చూపిస్తుంది. పరుషంగా మాట్లాడుతుంది. ”కత్తులతో మీ నోళ్లు పట్టేంత చిన్నచిన్న ముక్కలుగా నా శరీరాన్ని కోసుకోండి. మంటల్లో వేయదల్చుకుంటే వేసికాల్చండి. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. నేనైతే మీమాట వినను. ఎందుకు మీకీ మిడిసి పాటు? గర్వం? నా దే#హం మీ వశం. ఏమైనా చేసుకోండి. మనసు నా స్వాధీనం. దాన్ని మీరేమీ చేయలేరు!” అని తెగేసి చెప్పి, ఇంకా-
”నీచుడైన రావణుడు నాకు ఏడాది గడువిచ్చాడు. అది అతని చావు గడువు. అది దగ్గర పడ్తున్నది. ఆ గండం తప్పించుకోవడం, మీ రాక్షసులకు తెలవదు. ఉత్పాతం ఇప్పుడే పుట్తున్నది. చూస్తుం డండి. ధర్మమార్గంలో అపాయం తప్పించుకోవడం తెలియని మూఢ రాక్షసులు, ఈ కీడు మూడింది నావల్లనేనని, రావణాసురుడి భోజనానికి నన్ను #హంసించి పంపుతారేమో! ఆమాత్రం కీడు తప్ప దు. రాముడు తమను చంపుతుంటే, వాళ్లు నన్ను చంపుతారు. నా ప్రాణశ్వరుడు దయాశీలి, తామర రేకుల్లాంటి కళ్లున్న రాముడిని విడిచి ఏడుస్తున్న నన్ను మీరేంచేసినా, నేనేం చేయగలను?”
ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడే నిద్రిస్తున్న ”త్రిజ ట” అనే రాక్షస స్త్రీ, వీళ్లందరినీ మందలించింది. దూరంగా పొమ్మని అందరినీ గద్దిస్తుంది. ఈ రాక్షస సమూహమంతా మూలమట్టంగా నాశనమౌతుందని, సీతాదేవి భర్తకు విజయం తధ్యమని కలగన్నా ననీ, ఆ కలను తల్చుకుంటే దేహమంతా వణుకుతున్నదనీ, తన కల విషయం వివివరంగా వినమనీ అనగానే రాక్షస స్త్రీలందరూ భయం తో ఆమె చుట్టూ చేరారు. తాను కలలో చూసిన సన్నివేశం వివరాలను ఇలా చెప్పసాగింది త్రిజట-
”తెల్లటి ఏనుగు దంతంతో తయారై, ఆకాశంలో పయనించ గలిగిన పల్లకీని, వేయి హంసలు లాగుతుంటే, తెల్లటి వస్త్రాలు కట్టు కుని, రామచంద్రమూర్తి, లక్ష్మణుడితో కూడి వస్తాడు. సీత అంద మైన తెల్లటి చీరె కట్టుకుని, పాలసముద్రంలో, తెల్లటి పర్వతం మీద సూర్యుడితో కూడిన ప్రభలాగా, రాముడితో వుండగా చూసాను. నాలుగు దంతాల కొండలాగున్న ఏనుగుపై లక్ష్మణుడితో రాముడు పోతుండగా చూసాను.
”తెల్లటి వలువలు, పూదండలు ధరించి, ధీరుల్లో శ్రేష్ఠులైన రామలక్ష్మణులు, చిగుళ్ల లాంటి పాదాలున్న సీత పక్కన సంతోషం తో వుండగా చూసాను. అదిచూడగానే నా గుండెలు పగిలాయి. ఆ పర్వత శిఖరం మీద ఆకాశాన్ని తాకుతున్న ఏనుగుపై, రాముడి తొడ మీద సీతాదేవి కూర్చొని వుంది. సూర్యచంద్రులను తాకుతున్నదా అనిపించింది. రాజకుమారులైన రామలక్ష్మణులు, చంద్రుడిలాంటి ముఖమున్న సీతాదేవి, స్పష్టంగా భద్రజాతి ఏనుగుపై కూర్చొని లంక మీద ఆకాశాన వున్నట్లు కలగన్నాను. ఎనిమిది మేలుజాతి ఎడ్లను కట్టిన రథమెక్కి రాముడు ఈ సీతాదేవితో రావడం చూసాను.”
”సూర్యకాంతిగల పుష్పక విమానంలో రామలక్ష్మణులు, ఉత్తరదిశగా సీతతో వెళ్ళడం చూసాను. ఇది నిజమవుతుందనిపిస్తు న్నది’.
(స్వప్నక్రమం: రామలక్ష్మణులు పల్లకీలో సీతను వెతుకుతూ లంకకు వస్తారు. లంక దగ్గర పాలసముద్రంలో ఒక తెల్లటి కొండ దగ్గరకు రాముడు వచ్చి చేరుతాడు. సీత కూడా ఆ కొండ దగ్గరే వుం ది. రామలక్ష్మణులు పల్లకి దిగి ఏనుగునెక్కి సీత దగ్గరకొచ్చారు. సీత కూడా ఏనుగునెక్కి పెనిమిటి తొడపై కూర్చున్నప్పుడు సూర్యచంద్రు లను తాకుతున్నట్లుగా వుంది. ఈవిధంగా వాళ్లు లంకకు ఆకాశ మార్గాన వచ్చి, ఏనుగు దిగి, ఎనిమిది ఎడ్లు కట్టిన రథంపై కూర్చుని, లంకకొచ్చి, పుష్పక విమానం ఎక్కి ఉత్తరదిశగా వెళ్ళారు.)
”పాపాత్ములు స్వర్గం దగ్గరకు ఎట్లా పోలేరో, అట్లే దేవరాక్షస సమూహాలు యుద్ధ³రంగంలో, శ్రీరాముడిని సమీపించలేవు. రావ ణుడు ఒంటికి నూనె పూసుకుని, నూనె త్రాగుతూ, గన్నేరు పూలదం డలు మెళ్లో వేసుకుని, ఎర్రబట్టలు కట్టుకుని, బోడితలతో, నల్లబట్ట లు ధరించి, పుష్పక విమానం నుండి ఒక ఆడది ఈడుస్తుంటే, నేలపై బడి బాధపడ్తుంటే చూసాను. గాడిదలు కట్టిన రథం మీద, ఎర్ర పూదండలు వేసుకుని, ఎర్రగంధం పూసుకుని, పిచ్చివాడిలాగా నూనె త్రాగుతూ, గంతులేస్తూ, గాడిద మీద దక్షిణ దిక్కుగా పోతుం టే చూసాను. గాడిద మీద పోతున్నవాడల్లా తలకిందులుగా పడిపో తాడు. పడి, భయంతో దిగ్గునలేచి, తెల్లబోయి, మత్తుతో వికలుడై, భయపీడితుడై, వాగుతూ, బట్టలిప్పేసి, దిక్కుతోచక, భయంకరమై న, అసహ్యమైన బురదలో పడిపోవడం చూసాను. కాళి అనే ఓ స్త్రీ ఎర్రగుడ్డేసుకుని, బురద పూసుకుని, వాడిమెడను కౌగలించుకుని, రాక్షస రాజును దక్షిణదిక్కుగా ఈడ్చుకుంటూ పోతుంది.”
”కుంభకర్ణుడి పైకూడా ఇలాంటి కలే కన్నాను. రావణుడి కొడు కులు నూనెలో మునగడం చూసాను. పందిపై రావణుడు, మొసలి పై ఇంద్రజిత్త్తు, ఒంటెపై కుంభకర్ణుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం చూసాను. ఒక్క విభీషణుడు మాత్రం తెల్ల గొడుగు, తెల్ల బట్టలు, తెల్లగంధం పూతతో, ఆటపాటల మధ్య, మేఘధ్వని గల ఒక పెద్ద ఏనుగునెక్కి నలుగురు మంత్రులతో ఆకాశ మార్గంలో పోతుంటే చూసాను. ఎర్రగుడ్డలు, ఎర్రమూల్యాలు ధరించి మేళ తాళాలతో వుండగా చూసాను. విరిగిన గోపురాలతో వున్న రావణ రక్షణలోని లంక సముద్రంలో పడుతుంటే చూసాను. రాముడికి భృత్యుడైన ఓ కోతి వచ్చి లంకను కాల్చి బూడిద చేయగా చూసాను. ఏడుస్తున్న ఆడవాళ్లు నూనె త్రాగి లంకలో వేడి బూడిదలో పడిపోవ డం, కుంభకర్ణుడు, ఇతర రాక్షసులు పౌరుషం పోయి, పేడమడుగు లో పడుతుంటే చూసాను.” తనకొచ్చిన కల విషయం చెప్పడంతో పాటు, రాక్షస స్త్రీలను కూడా మందలిస్తుంది త్రిజట ఇలా:
”రాక్షస స్త్రీలారా లేచి చాటుగా పొండి. సీతాదేవిని తీసుకెళ్లటా నికి ఇక్కడకు వచ్చిన రాముడు, భయంకరంగా రాక్షసులందర్నీ చంపుతున్నప్పుడు, తన భార్యను బాధించిన మిమ్ములనందరినీ కూడా చంపకుండా వూరుకోడు. అందువల్ల మీమాటలు చాలిం చండి. బెదిరింపు మాటలు మానండి. ప్రాయశ్చిత్తంతో క్షమించ మని సీతను వేడుకుందాం. నా కల నిజమైన కల. సీత తప్పక తన భర్త ను చేరుతుంది. సీత దు:ఖాన్ని అనుభవించడానికి అర్హురాలు కాదు. ఈమె దివ్యసుఖాలను అనుభవిస్తుంది. ఈమెను బాధిస్తే మన కొచ్చిన లాభమేంటి? ఆమె ఎడమకన్ను ఎట్లదురుతుందో చూడం డి. అది ఆమెకు మేలుచేస్తుంది. ఈమె అనుకున్నట్లే భర్తను కలు స్తుంది. రావణుడు నాశనం అవుతాడు. రాముడి గెలుపు ఖాయం”.
ఇది చెప్తుంటే ఉన్నట్లుండి సీతాదేవి ఎడమచేయి పులకించి అది రింది. ఎడమతొడా అదిరింది. అంటే రాముడు సమీపంలోనే వున్నా డని మంగళసూచిక. మొదట సీతమ్మ ఎడమ కన్ను అదిరింది. వెంటనే ఎడమ భుజం అదిరింది. తరువాత ఎడమ తొడ అదిరింది. ఇవన్నీ త్రిజట చెప్పినప్పుడు ఆ రాక్షస స్త్రీలంతా చూసారు. నిజమే నని నమ్మక తప్పింది కాదు. కొమ్మల మీదున్న పక్షులు సంతోషంతో, ఓదార్పు మాటలు పల్కుతూ, శుభసూచకం ప్రేరేపిస్తూ సీతకు ధై ర్యాన్ని కలిగిస్తున్నాయనీ, దీన్నిబట్టి సీతకు త్వరలోనే శుభం కలుగ నున్నదనీ, కాబట్టి రాక్షసులు ఆమెను బాధించవద్దనీ అంటుంది త్రిజట. రాక్షస స్త్రీలంతా, త్రిజట చెప్పినట్లే సీతాదేవి శరణుజొచ్చా రు. రక్షిస్తానని సీత వారికి అభయమిస్తుంది.
త్రిజట విభీషణుడి కూతురని కొందరు, కాదని మరికొందరు అంటారు. ఆమె సీతాపక్షపాతి, అభిమానం వున్నామె. కలంతా కల్పి తమనుకున్నా, కోతి వచ్చే విషయమ, లంక కాల్చే విషయం వూహం చని విషయమే కదా! అంటే స్వప్నమంతా కల్పితం కాకపోవచ్చు. రామాయణంలో మూడు స్వప్నాలున్నాయి. దశరథ స్వప్నం, భర త స్వప్నం, త్రిజట స్వప్నం. మూడూ నిజమయ్యాయి. భగవంతుడే నిద్రపుచ్చుతూ, మేల్కొన్నప్పుడున్న ఇంద్రియాలను తానే గ్రహంచి, బాహ్యంద్రియాలను విస్తరించి, స్వప్నాలను వాడి, వాడి అదృ ష్టం ప్రకారం సృష్టించి, కొంతసేపు వాడనుభవించేటట్లు చేస్తాడు. స్వప్నంలో కనిపించేవన్నీ సృష్టించబడినవే. స్వప్నాల్లో చూసినవన్నీ అసత్యం కాదు. స్వప్నాలు యదార్థమౌతాయనడం శాస్త్ర సమ్మతం. త్రిజట తన స్వప్నాన్ని వివరించిన విధం రాక్షస స్త్రీలకు హడలెత్తిం చగా, శింశుపావృక్షంపై కూర్చొని ఇదంతా వింటున్న హనుమంతుడికి ఇక చేయవలసిన పని ఏదో అందంగా సూచించినట్లయింది. సీతాదేవికి మళ్లి శుభ శకునాలు కనపడసాగాయి. సీతాదేవి ఎడమకన్ను చేప తాకిన పద్మంలాగా అదిరింది. ఆమె ఎడమ చేయి అదిరింది. ఇలా శుభశకునాలు కన్న సీతాదేవి మోము శోకం వదలి, చంద్రుడున్న రాత్రిలాగా ప్రకాశించసాగింది. అంటే భర్తతో గూడిన సంతోషం కలిగింది.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం ఆధారం)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement