Saturday, November 23, 2024

తిరుమ‌ల అత‌లాకుత‌లం

భారీ వర్షం.. రెండు ఘాట్‌ రోడ్లు మూసివేత
వర్షబాధిత భక్తులకు మూడ్రోజుల తర్వాత దర్శన అవకాశం
రాకపోకలు బంద్‌
పైవారు పైనే.. కిందివారు కిందే
భక్తుల అవస్థలు వర్ణనాతీతం!

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల కొండపై గురువారం భారీ వర్షం బీభత్సమే సృష్టించింది. వాన నీరు వరదై పారింది. సాయంత్రం ఏకధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దయ్యాయి. తిరుమల కొండపై ఎటుచూసినా జల ధారలే కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆలయ మాడవీధులతో పాటు ఘాట్‌ రోడ్డులలో భారీ వరద నీరు ప్రవహిస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి టిటిడి డేటా సెంటర్‌లోకి నీరు ప్రవేశించడంతో ఆన్‌లైన్‌ సేవలన్నీ స్తంభించాయి. రెండు ఘాట్‌ రోడ్డులను మూసివేసింది. వాయుగుండం ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో తిరుమలలో ఎటుచూసినా వరద నీరు ఏరులై పారుతున్నది. తిరుమల అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు చేరింది. ఆగకుండా కురుస్తున్న వర్షానికి ఆలయ మాడవీధులతో పాటు తిరుమలలోని చాలా ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక ఔటర్‌ రింగ్‌రోడ్డులో వరదనీరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండగా స్థానికులు నివశించే బాలాజినగర్‌లోనూ వరద నీరు ఏరులై పారుతుంది. అవ్వాచారి కోన వద్ద ఉన్న కొండపై నుంచి వర్షపు నీరు భారీగా కిందకు పడుతుండడంతో ఆ ప్రాంతాలలో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారింది. వరదను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే టిటిడి నడకదారులను మూసివేయంతో పెద్ద ప్రమాదం తప్పింది. పలు ప్రాంతాలలో కొండచరియలు, చెట్లు విరిగి పడుతుండండతో అప్రమత్తమైన టిటిడి భద్రతా, ఇంజనీరింగ్‌, అటవీ సిబ్బంది బృందాలుగా విడిపోయి ఎప్పటికప్పుడు జేసీబీల సహాయంతో నేలకొరిగిన చెట్లతో పాటు బండరాళ్లను, మట్టిపెట్టలను తొలగిస్తున్నారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్‌ రోడ్డులో 9 నుంచి 16వ కిలోమీటర్‌ వరకు పలు చోట్ల బండరాళ్ళు విరిగి రోడ్లపై పడడంతో ఇంజనీరింగ్‌, అటవి, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని రాళ్ళను తొలగిస్తున్నారు. భారీ వర్షానికి తిరులమ కొండపై దాదాపు అన్ని నెట్‌వర్క్‌ వ్యవస్థలు స్తంభించాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌లు, ఇంటర్‌నెట్‌ పనిచేయక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టిటిడి డేటా సెంటర్‌లోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ఆన్‌లైన్‌ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గదుల కేటాయింపు, టికెట్లు పూర్తిగా నిలిచిపోయి కొన్ని చోట్ల భక్తులకు ఇబ్బందులు కలుగకుండా టిటిడీ మాన్యువల్‌గా గదులను కేటాయిస్తుంది. మలుపుల వద్ద ప్ర యాణం ప్రమాదకరంగా మారడంతో ఘాట్‌ రోడ్డులో నేడు భక్తులను అనుమతించే అవకాశం కనపడడం లేదు. ఇక నడకదారులలోనూ అదే పరిస్థితి ఉంది.
నేడు కూడా శ్రీవారి నడకదారులు మూసివేత తుఫాను వరద ఉధృతి మరింత ఎక్కువ కావడంతో తిరుమల శ్రీవారి కాలినడక అలిపిరి శ్రీవారి మెట్టు- మార్గాలను శుక్రవారం రోజున కూడా మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటికే 17 18 తేదీల్లో శ్రీవారి నడకదారులు మూసివేసిన సంగతి తెలిసిందే. తిరుమలలోని జపాలి ఆంజనేయ స్వామి ఆలయం నీటమునిగింది.
తిరుమలలోని ప్రాజెక్టులన్నీ నీటితో ఫుల్‌
తిరుమలలోని ఆకాశగంగా, గోగర్భం డాం, పాపవినాశనంలతో పాటు- ఇతర డ్యాముల నీ వరద నీటితో పూర్తిగా నిండిపోయాయి.. వరద వృద్ధి ఎక్కువ కావడంతో మూడు ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు.
భక్తుల్లో ఆందోళన
తిరుమలకు వచ్చి పోయే రెండు ఘాట్రోడ్లో వర్షం ధాటికి కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో రెండు గాడ్‌ రోడ్లను మూసివేశారు. తిరిగి ఎప్పుడు ఘాట్రోడ్డులో తెరిచేది త్వరలో ప్రకటిస్తామని టిటిడి పేర్కొంది. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తిరుపతి – తిరుమల ఘాట్‌ రోడ్లు మూసివేయడంతో భక్తులు తీవ్ర ఆందోళన నెలకొంది. కొంతమంది భక్తులు తిరుగు ప్రయాణం అయ్యేందుకు ముందస్తుగా విమానం రైలు బస్సు లలో రిజర్వేషన్లు చేసుకొని ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్‌ రోడ్డుని కూడా మూసివేయడంతో తిరుమలలో ఉండిపోయిన భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి తిరుమల శేషాచల కొండల నుంచి వచ్చే వరద నీటికి తిరుపతి నగరం జలమయమైంది. సుమారు పది గంటలపాటు- విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ఉధృతి అధికం కావడంతో నగరంలోని 20 కాలనీలకు పైగా నీటమునిగాయి.తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతి లో చిక్కుకు పోయిన భక్తులకు వసతి ఏర్పాటు- చేసినట్లు- టీ-టీ-డీ ఒక ప్రకటన లో తెలిపింది. వసతి కోసం ఇబ్బందులు పడుతున్న భక్తులు తిరుపతి లోని శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాలకు వెళితే సిబ్బంది వసతి ఏర్పాటు చేస్తారు.
దర్శనానికి వెళ్లలేని భక్తులకు వర్షాలు తగ్గాక అనుమతి : టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కలిగి ఉండి భారీ వర్షాల కారణంగా వెళ్లలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది.

జల దిగ్బంధంలో తిరుపతి

తుపాను ప్రభావంతో గురువారం తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు- ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు- ప్రాంతాల్లోని ప్రజలు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గురువారం తెల్లవారుజాము నుంచిఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమల శేషాచలం కొండల్లోని వరదనీరు నగరంలోని కాలువల ద్వారా పొంగిపొర్లి రోడ్ల మీదికి చేరాయి. తిరుపతిలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు78.8 శాతం వర్షపాతం నమోదయింది. గతంలో 22 ఏళ్ల క్రితం కురిసిన వరద ఉధృతి తిరిగి గురువారం కురుస్తుందని స్థానికులు చెప్పుకొచ్చారు.

సహాయ శిబిరాలు తెరవండి
వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.1000 మంజూరు
తుఫాన్‌ ప్రభావిత జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష
అమరావతి, అంధ్రప్రభ: భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు . అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు ఒకసారి కలెక్టర్లతో మాట్లాడిన సీఎం, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి వారితో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ. వేయి రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు. తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement