Saturday, November 23, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : సూర్యప్రభ వాహనం (ఆడియతో..)

సూర్యప్రభ వాహన సేవ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

‘సూర్య ఆత్మ జగత: తస్థుషశ్చ’ అని వేదవాక్యం.

అనగా కదిలే వాటికి కదలని వాటికి సూర్యుడే ఆత్మ అని అర్థం. తన కిరణాల ద్వారా భూమి పై ఉన్న జలాన్ని తీసుకొని, ఆకాశంలో మేఘాలుగా మార్చి భూమిపై వర్షం కురిపిస్తాడు సూర్యుడు. ఆ నీటితో చెట్లు, గడ్డి పెరిగితే వాటితో పశువులు బ్రతుకుతాయి, పంటలు పండి సకల మానవులకు జీవనాధారమవుతాయి. ఆ పంటలతో పురోడాశాన్ని తయారుచేసి దాన్ని హవిస్సుగా అగ్నిలో వేస్తారు. గడ్డిని ఆహారముగా తీసుకున్న గోవులు పాలిస్తే ఆ పాలను పెరుగుగా, దాన్ని చిలికి వెన్నగా, దాన్ని కరిగించి నెయ్యిగా చేసి ఆ నెయ్యితో హోమం చేస్తారు. హోమంలోని ఆహుతులను తీసుకున్న సూర్యభగవానుడు వర్షాన్ని కురిపిస్తాడు. సూర్యుని ఎండే చంద్రునిలో చేరి వెన్నెలవుతుంది. వారిద్దరి కలయికతో మంచు ఏర్పడుతుంది. మంచుతో పంటలు పండుతాయి. వెన్నలతో పంటలు పెరుగుతాయి. ఎండతో ప్రాణుల ఆరోగ్యం సమకూరుతుంది. ఇలా సకల జగములకు సూర్యుడే ఆధారం.

వయస్సు, సంవత్సరము, అయనము, మాసము, పక్షము, వారము అను కాలగణనకు, లెక్కలకు ఆధారం సూర్యుడే. ఆ సూర్యుని ప్రభా అంటే సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుని ప్రభే అందుకే ‘ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ: సరసిజాసన సన్నివిష్ట:’ అని చె ప్పబడుతున్నాడు సూర్యుడు. సూర్యమండల మధ్యలో ఉండేవాడు నారాయణుడే కావున అతడిని సూర్యనారాయణడు అంటారు అనగా సూర్యప్రభ అంటే తన తేజస్సుతోనే, తన తేజస్సునే తనను లోకానికి సాక్షాత్కరింప చేస్తాడని అర్థం. అంటే భగవంతుడిని చూపేది, భగవంతుని తేజస్సే అంటే జ్ఞానమే. సూర్యప్రభ వాహనం అంటే జ్ఞానమే వాహనమని అర్థం. ఇలా సూర్యప్రభ వాహనాన్ని అధిష్టించిన స్వామిని సేవించి భగవత్స్వరూప జ్ఞానాన్ని పొంది భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని, పొందుతారని, పొందాలన్న స్వామి ఆదేశాన్ని తలదాల్చి తరిద్దాం.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement