Saturday, November 23, 2024

తపనే తపస్సు

తపస్సు అనేది విరివిగా ఆధ్యాత్మిక పరిభా షలో వాడే పదం. తపస్సు గురించి ఆదిశంకరులు తమ ఆత్మబోధలో వివరించారు. భగవంతుని కోసం నిత్యం ప రితపించడాన్ని, మనోవాక్కాయ కర్మ లయందు ఆధ్యాత్మిక చింతన చేయడాన్ని, భగవం తునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణ చేయడాన్ని తపస్సు అని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముని మహాభక్తుడు తులసీదాస్‌ కూడా తమ రామచరిత మానస్‌లో తపస్సు గురించి చెప్పిన పద్యం ఎంతో ప్రేరణాత్మక మైందిగా చెబుతారు సాహిత్య విశ్లేషకులు. ఆ పద్యం ఇదే:

తప్‌ బల్‌ సే జగ్‌ సుజాయి విధాతా
తప్‌ బల్‌ విష్ణు భయే పరిత్రాతా
తప్‌ బల్‌ శంభు కరహి సంఘారా
తప్‌ తే అగమ్‌ న కఛు సంసారా

బ్రహ్మ తన తపోబలంతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. త న తపశ్శక్తితో విష్ణుమూర్తి ఈ జగత్తును పాలిస్తున్నాడు. భోళా శంకరుడు ఆ సృష్టిని తన తపశ్శక్తితో సంహరిస్తున్నాడు. తపో బలంతో సాధించలేనిది ఏదీ లేదు అంటాడు తులసీదాసు. మనిషి మనస్సంకల్పంలో వచ్చే తపన, అసాధ్యాలను సాధ్యాలుగా చేసి చూపగల దని పద్యం అంతరార్థం.
ఒక మంత్రాన్ని, ఏదో ఒక రూపాన్ని ఉపాసిస్తూ నిరంతర ధ్యానంలో ఉండటమే తపస్సు కాదంటారు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించటం, ఆరాటపడడాన్ని తపస్సు అంటారు విజ్ఞులు. మనస్సు సంకల్పించుకున్న భావనకు ఉన్న శక్తి, బలం ఈ సృష్టిలో దేనికీ లేదు. మనస్సు ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్త్తూ ఉంటుంది. అలా ఆలోచించడాన్ని ఆరాటపడడం అనరు. ఆరాటపడడం అంటే చంచలమైన మనస్సును నియంత్రించి నిర్దిష్టమైన ల క్ష్యాన్ని దానికి నిర్దేశించి… ఆ దిశగా మనసును మళ్లించడాన్ని ఆరాటపడడం అంటారు. ఆ ఆరాటాన్నే తపన లేదా తపస్సు అంటారు.
మంచి కోసం ఆరాటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే చెడు కోసమైతే చెడు ఫలితాన్ని ఇస్తుం ది. శీకృష్ణుడు భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగంలో తపస్సుల గురించి ఎన్నో వివరాలు ఇచ్చాడు. దేవతలను, గురు జనులను, జ్ఞానులను సేవించటం, నిరాడంబరత్వం, బ్రహ్మచర్యం, అహింస అనేవి శారీరక తపస్సులుగా పిలువబడ తాయి. ఉద్రేకం కల్పించనిది, ప్రియమైనది, హిత మును కలుగజేయునది అయిన భాషణం, అలాగే వేదశాస్త్ర పఠనం మొదలైన వాటన్నిటినీ వాచక తపస్సులంటారు. మానసిక ప్రశాంతత, శాంత స్వబావం , భగవచ్చింతన, మనో నిగ్రహం, అంత:కరణ శుద్ధి మొదలైనవి మానసిక తపస్సులుగా చెబుతారు. శారీరక, వాచక, మానసిక తపస్సులను ఫలాపేక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినపుడు వాటిని సాత్విక తపస్సులంటారు. ఇతరుల నుంచి సత్కారాలు, గౌరవాలు, పూజలు అందుకోవ డానికి, స్వార్థ ప్రయోజనాల కోసం దంభంతో చేసేవి, అనిశ్చిత ఫలాలను గాని, క్షణికమైన ఫలితా లను గాని ఇచ్చునవి రాజసిక తపస్సులంటారు. మొండి పట్టుదలతో, మనో వాక్కాయములకు బాధను కలిగించేది, ఇతరులకు కీడు కలగించటా నికి చేసేవి అయిన తపస్సులను తామసిక తపస్సులంటారు.
పూర్వం ఋషులు, మునులు, మనస్సును నియంత్రించి, ఒక నిర్దుష్టమైన ల క్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా మనస్సును మళ్ళించి ప్రశాంతంగా తపస్సులో కూర్చుని భగవన్నా మాన్ని ఉచ్చరించేవారు. అలా వారు చేసే తపస్సు ఫలించి మంచి ఫలితం ఇచ్చేది. రామాయణాన్ని రాసిన వాల్మీకి, మహా భారతాన్ని రచించిన వ్యాసుడు అనేక సంవత్స రాలు లోక కళ్యాణార్థం చేసిన తపస్సు ఫలించి, మనిషి మనుగడకు కావలసిన మంచి ఆచరణలు ఉదహరిస్తూ రాసిన గ్రంథాలు నేటికీ దారిదీపాలై మానవ జాతిని నడిపి స్తున్నాయి. అందుకే సత్సంకల్పాలతో చేసే తపస్సు ఎప్పుడూ మంచినే పంచుతుందనేది యధార్థం.
పూర్వకాలంలో రాజులు, మహారాజులు కూడా మంచి సంకల్పాలతో తపస్సు చేపి మంచి ఫలితాలు పొందారు. ఉదాహరణకు సూర్యవంశపు రాజైన భగీరథుని త పస్సు గురించి చెప్పుకోవాలి. తన పూర్వులకు ఉత్త్తమ గతులు కల్పించడం కోసం గంగను రప్పించాలని భగీ రథుడు తపస్సు చేశాడు. ఫలితంగా గంగాదేవి దివి నుంచి భువికి దిగి వచ్చి అతని అభీష్టాన్ని తీర్చింది. అది మనస్సంకల్ప బలం. మనస్సుకున్న అపారమైన శ క్తి.
మరి కొందరు రాజులు దుష్టసంకల్పాలతో తపస్సు చేసి గొప్ప శక్తులు పొంది వాటితోనే ప్రజలను పీడించి అంతమైపోయిన ఉదంతాలు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. అలా అంతమైన వారిలో రావణుడు, హిరణ్యకశిపుడు ముందు వరుసలలో ఉంటారు.
రావ ణుడు సృష్టికర్త అయిన బ్రహ్మకు మనుమడు. రావణుడు చిన్నప్పటి నుం చే తామసిక స్వభావం కలిగి ఉండేవాడు. బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి బలపరాక్రమాలు, వరాలు పొందాడు. ఆ బల గర్వంతోనే సీతాదేవిని చెరపట్టి రాముని చేతిలో హతమవుతాడు. అలా తాను పొందిన తపోబలాన్ని దుష్ట కార్యాలకు విని యోగించి రావణ బ్రహ్మగా పేరున్న ఆయన రావణాసురునిగా పేరు తెచ్చుకున్నాడు. హిరణ్యకశిపుడు రాక్షస రాజు. తన సోదరుడు హిరణ్యాక్షుని ప్రాణాలు తీసిన హరి పట్ల పగతో ప్రతీ కారం తీర్చుకోవడానికి నూరేళ్లు నిద్రాహారాలు మా ని బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. పొందిన వరా ల గర్వంతో ముల్లోకాలను గడగడలాడిం చాడు. చివరకు నరసిం హుని చేతిలో హత,మయ్యాడు.
మనిషి మన సు మంచి కోసం ఆరాటపడాలపి పై ఉదాహరణలు నొక్కి చెబుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనుషుల మనస్సంకల్పాలు స్వార్థం, ద్వేషం, అసూయలతో నిండి ఉంటున్నాయి. కాబట్టే వారి వ్యక్తిత్వాలు కలుషిితమై అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. చికిత్సలకు లొంగని భయంకర వ్యాధులకు గురవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు తన మంచితో పాటు ఇతరుల మంచిని కోరుకునే విధంగా ఉన్నప్పుడు అది గొప్ప తపస్సు అవుతుంది.

పరికిపండ్ల సారంగపాణి
98496 30290

Advertisement

తాజా వార్తలు

Advertisement