Friday, November 22, 2024

జీవన ఫల ప్రదాతా!

ఔర మనోరథ జో కోఇలావై!
సో ఇ అమిత జీవన ఫల పావై!!
ఎవరైనా భిన్నభిన్నమైన కోరికలతోనైనా హనుమను ప్రార్థిస్తే అతడి కోర్కెలను తీర్చటమేగాక, వారికి జీవన ఫలప్రాప్తిని
అనుగ్రహిస్తాడు.
ప్రాపంచిక కోరికలకు అంతులేదు. ఒకటి తీరగానే మరొకటి
పుడుతూనే ఉంటుంది. ఇదొక వాసనావలయం. తీర్చగలిగిన వాడొకడుంటే అడిగేవాడికి ఆశలు పెరుగుతూనే ఉంటయ్‌.
సంసార ధర్మంలో కోరికలు లేకపోవటమంటూ ఉండదు.
అవి ధన, ధాన్య, పుత్ర, కళత్ర, భూ, ఆయు, ఆరోగ్య సంబం ధులుగానే ఉంటయ్‌. ఎంత లభించినా మరింత దొరకాలన్న ఆశ, పేరాశ, దురాశలకు దారితీసే సంసార బంధ చక్రమిది. ఎవరోగాని ఈ చక్రభ్రమణం నుండి తప్పించుకోలేరు. మితిమీరిన ఆశలు దుర్దశకు దారితీస్తయ్యని తెలిసినా, మోహ వ్యామోహాలకు బలి అవుతూనే ఉంటారు.
కల్పవృక్షం వలె హనుమ కూడా అడిగినవన్నీ ఇవ్వడు. అడి గిన వాడి ప్రాప్తి, అర్హత, అవసరాన్ని అనుసరించి, ఆయా కోరిక లను తీర్చి, నిత్య వ్యవహార దు:ఖం నుండి తప్పిస్తాడు.
అయితే, స్పృహతో, ఆర్తితో, జిజ్ఞాసతో, ముక్తిని కోరి వచ్చిన వాడికి జీవన ఫలాన్ని అనుగ్రహిస్తాడు. వస్తువుల పట్ల ఏర్పడే
అభిమానాన్ని దూరం చేసి, మోహాన్ని క్షయం చేసి, మోక్ష స్థితిని అనుభవం లోకి తెస్తాడు. కోరికలను తుంచి దు:ఖాన్ని వదిల్చి, ఆనందాన్ని కలి గించి, మనసును మోక్షాపేక్ష వైపు మళ్ళిస్తాడు.
ఆయాసం లేని మరణం, దైన్యం లేని జీవితం… ఈ రెంటినీ హనుమ అనుగ్రహిస్తాడు.
దేనినైనా కోరుకోవటంలోనే అసలు తెలివి దాగి ఉంది.
అడిగి పొందేవన్నీ వరాలు!
అడగకుండా పొందేది కరుణ!
భగవంతుడు కరుణామయుడు!
– వి.యస్‌.ఆర్‌.మూర్తి
9440603499

Advertisement

తాజా వార్తలు

Advertisement