ఆది దైవం గణేశ్వరుడు. హిందూ ధర్మంలో అన్ని ఆరాధనా పద్ధతులు అనుసరించేవారు ఆరాధించే తొలిదైవం గణపతి. ఆది శంకరులు గణపతిని ఇలా స్తుతించారు.
అజం నిర్వికల్పం నిరాకారమేకం
నిరానందమానంద మద్వైత పూర్ణం
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం
పరబ్రహ్మ రూపం గణేశం భజేహం
పరతత్త్వమైన పరబ్రహ్మకు సాకారనిరాకార లక్షణాలున్నా యి. ఆ రెండూ ఒక్కటే. అద్వైత స్వరూపం. సాకారాన్ని అందిపు చ్చుకుని నిరాకారం వైపునకు ఏకాగ్రతతో ధ్యానించి సాగితేనే పర బ్రహ్మను చేరుకోవడం సాధ్యం. పరబ్రహ్మ స్వరూపుడైన గణపతి అనాది దైవం. ఆయన వేరు వేరు యుగాల్లో వేర్వేరుగా అవతరిం చాడని గణేశ పురాణం తెలియజేస్తున్నది.
కృత యుగంలో కశ్యప పుత్రునిగా వినాయకుడు జన్మించాడు.
త్రేతాయుగంలో నెమలి వాహనారూఢుడైన మయూరేశ్వరు డు , ద్వాపరయుగంలో గజాననుడిగా అవతరించి సింధురాసు రుని సంహరించాడు. కలియుగం (వర్తమానం) ధూమ్ర కేతువుగా అవతరించి నాస్తికులను రూపుమాపుతాడు. ఇలా ప్రతి యుగం లోను గణపతికి వేర్వేరు నామాలున్నట్టు తెలుస్తోంది.
గణపతి వైశిష్ట్యం
గణానాంత్వా గణపతిగుం
హ వామహే కవిమ్ కవీనామ్
అని గణపతిని వివరిస్తుంది వేద మంత్రం. గణపతి అన్న శబ్ద మునకు గణములకు అధిపతి అని చాలా విశిష్టమైన అర్థం ఉంది. గణము అనగా సమూహము. విశాలమైన ఈ ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల గణములు ఉన్నాయి. శరీరంలో కాళ్ళు, చేతులు, శిర స్సు, కనులు, చెవులు మొదలైన అవయవ గణములు ఉన్నాయి, ఆ అవయములకు అధిపతి శరీరమే కావున మొదటి గణపతి శరీరం.
శరీరంలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అనే 10 ఇంద్రియ గణములకు అధిపతి మనసు. అందుకే మరో గణపతి మనసు. మనస్సుతో కలసి ఉన్న ఇంద్రియ గణమునకు అధిపతి బుద్ధి. అందువల్ల ఇంకో గణపతి బుద్ధి. ఇక మన శరీరంలో అనేక మైన నాడులలో అధిపతి సుషుమ్న నాడే కావున మరో గణపతి సుషుమ్న నాడి. శరీరంలో ఉన్న అన్ని ఎముకలకు అధిపతి వెన్నె ముక. అన్ని ఎముకలు వెన్నెముకతో కలిసి ఉండి పని చేస్తాయి. ఏ అవయవానికి ఆ అవయవం ఎముకలు వేరుగా ఉన్నా ఒక వెన్నె ముక పని చేయకుంటే ఏ అవయవాలు పని చేయవు. అందుకే మరో గణపతి వెన్నెముక. అన్ని జీవాత్మలకు అధిపతి పరమాత్మ, ఆయనే అసలైన గణ పతి. అందరినీ శాసించే వాడు అందరికీ దారి చూపేవాడు, అందరి హితాన్ని ప్రియాన్ని కలిగించే వాడు పరమాత్మ. మనం ‘గణాం నాంత్వా’ అనే మంత్రంతో ధ్యానించేది ఆ పరమాత్మనే. నిజమైన గణపతి పరమాత్మే. నిజమైన అధిపతి అంటే నాయకుడు, పరిపాలకుడు. ఆయన ఫలమును తాననుభవి ంచాలని కోరుకోడు, అనుభవించడు కూడా, అందరికీ సమానం గా పంచుతాడు, అందరి చేత అనుభవింప చేస్తాడు. నాయకుడు అనుభవించడం మొదలు పెడితే ఇక సేవకులకు మిగిలేది ఏమి ఉండదు. అందుకే అధిపతి అయిన పరమాత్మ దేన్నీ అనుభవించడు అని ‘అనశ్నన్ అన్య: అభిచాక శీతి’ అని పరమాత్మ తాను దేన్ని అనుభవించకుండా అనుభవించే వారికంటే అధికంగా ప్రకాశిస్తాడు. నిజమైన కాంతి, తేజస్సు, సిద్ధి, బుద్ధి, బలము, శక్తి ప్రభావం స్వార్థం లేని వారికే ఉంటాయి. అంటే స్వార్థం లేనివాడే నిజమైన గణపతి అనే విశాలమైన అర్థం గణపతి శబ్దానికి ఉంది. అయినా అందరూ పామరులు పండితులు గృహస్థులు, వానప్రస్థు లు, లౌకికులు, వైదికులు కూడా విశాలమైన పరమార్థాన్ని తెలుసు కొని నలుగురికి తెలిపి ఆరాధించలేరు, కావున పరమాత్మ అర్థం చేసుకొని ఆరాధించి ఫలితం పొందడానికి గణపతిని ఏర్పరిచారు.
గణపతి రూపంలోని రహస్యాలు
గణపతికి ఉన్న రూపం మనకు అనేక సంకేతాలు, సందేశా లను అందిస్తుంది. ఆయనకున్న పెద్ద చెవులు, చిన్న క ళ్ళు ఎక్కువ గా విని తక్కువుగా చూడమని సందేశాన్నిస్తాయి. నాలుగు చేతు లు, నాలుగు పురుషార్థాలకు సంకేతం కాగా చేతులలో గల ఎనిమిది ఆయుధాలు అష్టకష్టాలు తొలగించడానికే. మూషికాసురుడిని దంతంతో సంహరించడం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ప్రా ణం ఉండి శరీరంలోని ప్రాణంలేని అవయవంతోటే మరణించాల ని మూషికాసురుడికి ఉన్న వరం. ప్రాణం ఉండి లేనిది దంతం కావున దానితోటే మూషికాసుడిని సంహ రించి గణపతి ఏకదంతు డయ్యాడు. మూషికం అంటే దొంగలించేదని లేదా మనస్సు అని అర్థం.
మూషి కం మనం చూస్తుండగానే ఎలా గైతే అల్లకల్లోలం సృష్టించి, పదార్థాలను దొంగిలిస్తుందో అదే విధంగా మన మనస్సు కూడా మన ఆరోగ్యాన్ని, వివేకాన్ని, ఆనం దాన్ని, జ్ఞానాన్ని దొంగలిస్తుంది. మన ఆరోగ్యాన్ని పాడుచేసే, ఆనం దాన్ని కొల్లగొట్టే వస్తువులనే మనస్సు కోరుకుంటుంది. చేయ కూడని పనులనూ చేయిస్తుంది ఇలాంటి మనస్సు అనే మూషి కాన్ని దంతంతోనే సంహరించాలి, ఎందుకంటే మన శరీరంలోని దంతమొక్కటే ఘనపదార్థాలను నమిలి నాలుకకు రుచిని అంది స్తుంది. రుచిని ఆస్వాదించమని మనస్సే ఆదేశి స్తుంది. గజాననుడు రుచిని అందించే దంతంతోటే మూషికాసురుడిని సంహరించాడు అంటే రుచిపై గెలుపు సాధిస్తే మూషికం మన వశమవుతుంది. అందుకే మూషికాసురుడు గజానుని వాహన మయ్యాడు. రుచిని అందించి మన మనస్సుకి లొంగకూడదని మూషికాసుర సంహా రం ద్వారా గణపతి మనకిచ్చిన ఉపదేశం.
గజానన ఆవిర్భావం
గజము దైవత్వానికి, మానవత్వానికి, రాక్షసత్వానికి, జ్ఞానాని కి, అజ్ఞానానికి ప్రతీక. మదమెక్కిన ఏనుగు అంతా ధ్వంసం చేస్తే, అదే మంచిగా ఉన్న ఏనుగు మావటి మాట వింటుంది. నీటిలోకి దిగిన గజము స్నానమాచరించిన వెంటనే తొండముతో మట్టిని తనపై తానే పోసుకుంటుంది. ఈ గజ స్నానం అజ్ఞానానికి ప్రతీక. సర్వశక్తిమంతుడు, సర్వ రక్షకుడు, జగన్నియంత అయిన భగవా నుడు భక్తి అన్న చిన్న అంకుశంతో భక ్తసులభుడయ్యాడు అదే విధంగా బలమైన ఏనుగు కూడా చిన్న అంకుశంతో నియంత్రించ బడటం దైవత్వానికి ప్రతీక. భగవంతుడు తనను కట్టేసే ‘భక్తి’ అనే తాడును ఎలాగైతే తానే ఇస్తాడో అదేవిధంగా గజము కూడా తనను కట్టే తాడును తానే ఇస్తుంది. ఎలాగైతే ఏనుగు తనపై ఎక్కించుకో దలచిన వారి కోసం కాలు ముందుకు చాచునో అదే విధంగా పర మాత్మ కూడా తనను చేరదలుచుకున్న వారికి తన పాదాలను ఆశ్ర యించమని తద్వారా తన వద్ద కు చేర్చుకుంటాడు.
పరమాత్మ నిత్య పరిశుద్ధుడై కూడా అనంతమైన కల్మషం నిండివున్న ఈ ప్రపంచంలోకి తనకు తానె దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం, జ్ఞానం, అజ్ఞానం అన్నింటికి ప్రతీకగా నిలిచాడు. గజా సురుడు స్వార్థం, ఆశతో పొట్టలో భగవంతుడిని దాచుకుని రాక్షస త్వాన్ని చూపాడు. పరమాత్మ సందర్శనతో దాచుకున్న భ గవంతు ని మరల ఇచ్చి మానవత్వాన్ని చాటాడు.
దేవీ పుత్రుడు గజాననుడయిన వృత్తాంతం..
శంకరుడు త్రిశూలంతో గణపయ్య శిరస్సు తీసి గజ శిరస్సును ఏర్పరిచి అందరికీ కరచరణాది ఆకారము ఒక్కటేనని ఒక తల మాత్రమే పేరును మారుస్తుందని తెలియజేశాడు. మరికాస్త లోతు కు వెళితే తల ఏదైనా తలలోని తలపులను బట్టి పేరు వస్తుంది కావు న భగవంతుడిని తలచుకుంటున్న ఒక రాక్షసుడి తలను ఆ జగత్పతి తన కుమారునికి అతికించాడు. రాక్షసత్వం, మానవత్వం, దైవ త్వం అనేవి తలపులను బట్టే కాని తలను బట్టి కాదని లోకానికి సందే శ మందించాడు శంకరుడు. తన తల లోకపూజ్యం కావాలని, సదా శివ ధ్యానం చేయాలని కోరుకున్నవాడు కావున దేవీపుత్రునికి రాక్ష సుడైన గజాసురుని శిరస్సును అమర్చారు. కొన్ని సన్నివేశాలను లోతుగా విశ్లేషిస్తే అనంతమైన సత్యాలు ఆవిర్భవిస్తాయి. భగవంతు డ్ని తనలోనే దాచుకోవాలన్న స్వార్థం కలిగిన ఒక రాక్షసుడికి భగ వంతుడు వచ్చి తన కడుపున చేరగానే తన తల లోక పూజ్యం కావాలనే ఆలోచన కలిగింది. ఇంతమంచి ఆలోచన కలి గిన ఆ దేహం దేవాలయమైంది. దేవాలయానికి గోపురం ఎలాగో దేహానికి తల అలాంటిది. దేవాలయ గోపురాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పురాణాలు చాటుతున్నాయి. భగవంతుని ధ్యానం ఏదో ఒక రీతిలో భగవత్సంబంధానికి, లోకకళ్యాణానికి ఏవిధంగా దారి తీస్తుందో తెలియజేయటానికి గజానన అవతారం పెద్ద నిదర్శనం.
గణనాథుని హితోక్తి
వినాయకునికి గణాధిపత్యం లభించిన పిదప బ్రహ్మాది దేవ తలు గణపతికి ప్రియమైన ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం వంటి రుచికరమైన తినుబండారాలతో విందు చేశారు. అన్నింటిని ప్రీతితో కడుపు నిండా స్వీకరించిన గణపతి సంతోషంతో నాట్యం చేస్తూ తన తల్లిదండ్రులకి సాష్టాంగ ప్రణామం చేయడానికి అవ స్థపడగా ఇది గమనించిన చంద్రుడు పరిహాసం చేశాడు. రాజ దృష్టితో రాళ్ళు పగిలినట్టు చంద్రుడు దృష్టి తగిలి వినాయకుడు పొట్ట పగిలి మరణించెను. దానితో పార్వతికోపోద్రిక్తురాలై చంద్రుని చూసినవారికి నీలాపనిందలు వస్తాయని శపించడం తెలిసిందే.
పదవి పొందగానే ఒళ్లు, స్థితి మరచి ఎవరేమిచ్చినా హద్దు మీరి స్వీకరిస్తే వికటిస్తుంది. ఆహారంలో హితం మితం పాటించాలి. మితిమీరితే పెట్టినవారికి, తిన్నవారికి, చూచినవారికి నీలాపనిం దలే. ఆహారం ప్రాణం నిలపడమే కాదు ప్రాణాలు తీస్తుందని తెలియజేస్తుంది గణపతి వృత్తాంతం. పదవి ప్రాప్తిస్తే స్వార్థంమాని పదిమందికి పెట్టి తృప్తి పడాలని ఆ పదవిని పదిమందీ మెచ్చినపుడే సంబరమని సందేశం ఇస్తుంది గణపతి వృత్తాంతం. ఉండ్రాళ్ల ను చూసినంతనే తినాలనే ఆశపుడుతుంది. వస్తువును చూచిన వెంటనే అనుభవించాల నే ఆశ కలిగించేది ప్రకృ తి అనగా కోరికలు. కుడుములు త్వరగా అరగవు కావున అవి పాపాలు. పాయసం మధురంగా ఉంటుంది కావున అది భక్తి. గణపతి కి భక్తితో మన కోరికలు నివేదించి పాపాలను తొలగించమని అనగా విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధిని, తృప్తిని, ఫలితాన్ని కలిగించమని అర్థం. ఇది చూసే చంద్రుడు పరిహసించాడు.
చంద్రుడు అనగా మనస్సు. ‘చంద్రమా మనసో జాత:’ అని వేదవాక్యం. మనసు మనని చూసి పరిహసిస్తుంది. బుద్ధి చెప్పిన విధంగా నడుచుకుంటే ఆధిపత్యం లభిస్తుంది. పాపాలతోకాక పుణ్యాలతో కోరికలు కలిగితే బుద్ధి, సిద్ధులు మన వశమయ్యి అధిప తులమవుతామని నీతి పాఠాలు, ధర్మోపదేశాలు చేసి యోగమార్గం లో పరమాత్మను చేర్చే పరమ గురువు గణనాథుడు. ఆయన ఉప దేశాలను, సందేశాలను స్వీకరించి పుణ్యం పొంది మోక్షమార్గాన పయనిద్దాం.
– శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు