Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 19
19.
యో మామేవమసమ్మూఢో
జానాతి పురుషోత్తమమ్‌ |
స సర్వవిద్భజతి మాం
సర్వభావేన భారత ||

తాత్పర్యము : ఓ బారతా! సంశయరహితముగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగినవాడే సర్వమును ఎరిగినవాడు. అందుచే అతడు నా సంపూర్ణమగు భక్తియుత సేవలో నిమగ్నుడగును.

భాష్యము : దేవాది దేవుణ్ని అర్థము చేసుకున్న వ్యక్తి సర్వాన్ని తెలుసుకున్న వాడగునని ఈ శ్లోకము నందు స్పష్టముగా తెలుపుటమైనది. అటువంటి వ్యక్తి పరమ సత్యాన్ని అర్థము చేసుకొనుటకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించవలసిన అవసరము లేదు. అయితే ఎన్నో జన్మలు పరమ సత్యము గురించి మనో కల్పనలు చేసినప్పటికీ ఈ అవగాహనకు రానట్లయితే వారి ప్రయత్నాలు నిష్ఫలములయినట్లే లెక్క.

వేదాలను ‘శృతి’ అందురు. అనగా శ్రవణము చేసి తెలుసుకొనవలసినది అని. కాబట్టి ఈ జ్ఞానమును ప్రామాణికులైన వారు, అనగా కృష్ణుడు, అతని ప్రతినిథుల నుండి విని నేర్చుకొనవలసి ఉన్నది. స్వంత కల్పనలు, పుస్తకాలను చదువుట ద్వారా కాక భగవద్గీతను విధేయతతో విని నేర్చుకొనవలసి ఉన్నది. ‘భజతి2 అను పదము భగవంతునితో సంబంధములో అనేక చోట్ల వాడబడినది. అనగా భగవంతుని భక్తి చేయుట. అనగా కృష్ణ చైతన్యములో భగవద్భక్తి చేయు వ్యక్తి వేద జ్ఞానమును అర్థము చేసుకున్నట్లు లెక్క.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement