Monday, November 18, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 16
16.
ద్వామిమౌ పురుషౌ లోకే
క్షరశ్చాక్షర ఏవ చ |
క్షర: సర్వాణి భూతాని
కూటస్థోక్షర ఉచ్యతే ||

తాత్పర్యము : నశ్వరులు మరియు అనశ్వరులని జీవులు రెండు రకములు. భౌతిక జగమునందలి ప్రతి జీవియు నశ్వరము కాగా, ఆధ్యాత్మిక జగము నందు ప్రతి జీవియు అనశ్వరమని చెప్పబడినది.

భాష్యము : వేదాంత సూత్రాల యొక్క సారాంశాన్ని ఇక్కడ భగవంతుడు తెలియజేయుచున్నాడు. అసంఖ్యాకముగా ఉండు జీవరాశులను రెండు తరగతులుగా విభజించవచ్చును. మొదటి తరగతి వారు భౌతిక ప్రపంచముతో సంపర్కము చేత భౌతిక శరీరములను పొందుచూ ఉండును. వారిని పతితులు అందురు. ఇక రెండవ వారు భగవంతుని సృష్టి యొక్క ఉద్ధేశ్యముతో పూర్తిగా ఏకీభవించి భగవంతుని సాంగత్యమును విడువరు. వారిని పతనము కాని వారు అందురు. జీవులు భగవంతుని శాశ్వత అంశలు కావున వారి స్వతంత్రతను కోల్పోక జతపడి ఉందురని ఇక్కడ ‘కూట స్థ’ అను పదమునకు అర్థము. ఇక పతనము చెందిన పతిత జీవులు భౌతిక మనస్సు ఇంద్రియములను పొంది కష్టాలు పడుచుందురు. వారికి భౌతిక శరీరాలు ఉండుట చేత జన్మ మృత్యు జరా వ్యాధులు సంభవించి ఆత్మ మారుచున్నట్లుగా అనిపించును. ఇక ఆధ్యాత్మిక ప్రపంచములో ఉండు పతనము చెందని జీవులు ఆధ్యాత్మిక శరీరములను కలిగి ఉండుట చేత వారు జన్మ మృత్యు జరా వ్యాధులను అనుభవించరు. వారు ఎప్పుడూ భగవంతునితో జతపడి ఉండుట చేత ముక్త స్థితిలో కొనసాగుచూ ఉందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement