అధ్యాయం 15, శ్లోకం 5
5.
నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామా: |
ద్వంద్వైర్విముక్తా: సుఖదు:ఖసంజ్ఞై:
గచ్ఛంత్యమూఢా: పదమవ్యయం తత్ ||
తాత్పర్యము : మిథ్యాహంకారము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడివడినవారును, శాశ్వతత్వమును అవగతము చేసికొనినవారును, కామవర్జితులును, సుఖదు:ఖములనెడి ద్వంద్వముల నుండి బయటపడినవారును, భ్రాంతిరహితులై ఏ విధముగా పరమపురుషుని శరణువేడవలెనో తెలిసినవారును అగు మనుజులు అట్టి అవ్యయపదమును పొందగలరు.
భాష్యము : గర్వ రాహిత్యమే భగవంతుణ్ని శరణు పొందుటకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము. ‘ఈ ప్రపంచము నా ఆనందము కోసమే ఉన్నది’ అను మోహము గర్వమునకు కారణమగుచున్ది. ఈ ప్రపంచమున గౌరవ మర్యాదలను ఆశించువారు భగవంతుణ్ని పొందలేరు. జీవుడు కొంత కాలమే ఈ భౌతిక ప్రపంచమున ఉండటానికి వచ్చినా ‘మేమే దీని పాలకులము’ అని భావించి అనేక ప్రణాళికలను చేయును. ఎప్పుడైతే ఈ భ్రాంతి తొలగిపోతుందో కుటుంబ, సామాజిక, దేశీయ ఆసక్తుల నుండి విముక్తులగుదురు. ఆ తరువాత ఆధ్యాత్మిక జ్ఞానము వలన వాస్తవానికి, తనకు సంబంధించనది ఏది, తనకు సంబంధించినది ఏది అనే అవగాహనను పెంపొందించుకుంటాడు. తద్వారా సుఖ:దుఖాలు, కష్టనష్టాలు అనే ద్వంద్వాలను అధిగమిస్తాడు. అటువంటి వ్యక్తి భగవంతుణ్ని శర ణు పొందుటకు అర్హుడవుతాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..