అధ్యాయం 14, శ్లోకం 21
21.
అర్జున ఉవాచ
కైర్లింగై: త్రీన్ గుణానేతాన్
అతీతో భవతి ప్రభో |
కిమాచార: కథం చైతాన్
త్రీన్ గుణానతివర్తతే ||
తాత్పర్యము : అర్జునుడు ప్రశ్నించెను: హే ప్రభూ! ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తనమెట్టిది? ప్రకృతి గుణములను అతడు ఏ విధముగా అధిగమించును?
భాష్యము : ఈ శ్లోకమున అర్జునుడు ఎంతో అర్థవంతమైన ప్రశ్నలను అడుగుచున్నాడు. మొట్టమొదటి ప్రశ్న, దివ్య స్థరములో ఉన్నటువంటి వ్యక్తి లక్షణములు ఎట్లుండును అని? తద్వారా మనము అటువంటి వ్యక్తిని గుర్తించవచ్చును అని ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ఇక రెండవది అతడు ఎట్లు ప్రవర్తించును, అతని కార్యములు ఎట్లుండును? అనగా అతడు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండునా లేదా అని ప్రశ్నించుచున్నాడు. ఇక మూడవది, అటువంటి దివ్యస్థితిని ఎట్లు సాధించవచ్చును? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అనగా దివ్యస్థితిని చేరుటకు ప్రత్యక్షమైన, సులువైన మార్గము ఏదీ అని. ఇలా అర్జునుడు అడిగిన అతి ముఖ్యమైన ప్రశ్నలకు రాబోవు శ్లోకములలో భగవంతుడు సమాధానము చెప్పబోవుచున్నాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …