అధ్యాయం 14, శ్లోకం 18
18.
ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా:
మధ్యే తిష్ఠంతి రాజసా: |
జఘన్యగుణవృతిస్థా:
అధో గచ్ఛంతి తామసా: ||
తాత్పర్యము : సత్త్వ గుణము నందున్నవారు క్రమముగా ఊర్ద్వలోకములకు ఉద్దరింపబడుదురు. రజోగుణము నందున్నవారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణము నందున్నవారు నరకలోకములకు పతనము చెందుదురు.
భాష్యము : త్రిగుణముల ఫలితములు, ఈశ్లోకమున మరింత స్పష్టముగా తెలుపబడినవి. సత్త్వ గుణములో నున్నవారు వచ్చే జన్మలో ఉన్నతలోకాలైన స్వర్గలోకములకు వెళ్ళవచ్చు ఉదాహరణకు బ్రహ్మదేవుడు ఉండే బ్రహ్మలోకము, అక్కడ జీవితము ఎంతో సౌకర్యవంతముగా ఉంటుంది. ఇక రజోగుణము మిశ్రితమైనది. మహా అయితే ఈ భూలోకమునందే గొప్ప రాజుగానో లేక ధనికునిగానో కొనసాగుతాడు. తమోగుణ మిశ్రితమైనచో అధోగతి పాలయ్యే అవకాశము కలదు. ఇక తమోగుణము పెంపొందించుకున్నట్లయితే భవిష్యత్తు విపత్తులతో కూడుకొని ఉంటుంది. మానవజన్మ కాక మిగిలిన ఎనబది లక్షల జీవరాశులలో అనగా – పక్షలు, జంతువులు, సరీసృపాలు, చెట్లు చేమలు ఇలా ఏదో ఒక జీవరాశిగా జన్మించవలసి వస్తుంది. వారు అలా తమోగుణములోనే ఎక్కువ జన్మలు కొనసాగవలసి వస్తుంది. కాబట్టి కృష్ణచైతన్యమును స్వీకరించి రజోతమో గుణములను అధిగమించి సత్త్వ గుణమునకు చేరవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తు శూన్యము.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….