అధ్యాయం 14, శ్లోకం 6
6.
తత్ర సత్త్వం నిర్మలత్వాత్
ప్రకాశకమనామయమ్ |
సుఖసంగేన బధ్నాతి
జ్ఞానసంగేన చానఘ ||
తాత్పర్యము : ఓ పాపరహితుడా3! సత్వగుణము మిగిలిన రెండు గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వపాపఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణమున్నందున్న వారు సుఖభావన చేతను, జ్ఞాన భావన చేతను బద్ధులగుదురు.
భాష్యము : జీవుడు వేరు వేరు గుణాలచే బంధీ అయినపుడు ఏ ఏ భావాలను కలిగి ఉంటాడో ఈ శ్లోకాలలో వివరించనున్నారు. కొందరు ఆనందము చేత, మరికొందరు అనేక కార్యముల చేత, మిగిలిన వారు నిస్సహాయము చేత ప్రముఖముగా బంధీ కాబడుదురు. ఈ శ్లోకమున సత్త్వ గుణము గురించి చర్చించబడినది. సత్త్వ గుణము నందు ఉన్న వ్యక్తి భౌతిక కోరికలచే ఎక్కువగా ప్రభావితము కాక, భౌతిక జ్ఞానమును అర్థము చేసుకొనుటలో తెలివితేటలను కలిగి ఉంటాడు. అంతేకాక పాపము ఎక్కువగా లేకపోవుటచే కష్టాలు లేక ఆనందముగా ఉంటాడు. అయితే ‘నేను వేరేవారికంటే గొప్ప’ అను భావన వారిలో ప్రముఖముగా ఉంటుంది. భౌతిక జ్ఞానాన్ని కలిగి ఉండు శాస్త్రజ్ఞులు, తత్త్వవాదులు, కవులు దీనికి మంచి ఉదాహరణలు. ఈ భావన కారణముగా వారు ముక్తిని పొందక మరు జన్మలు తీసుకోవలసి ఉంటుంది. అయితే మాయ ఎంత శక్తవంతమైనదంటే ‘ఇటువంటి జీవితమే చాలా బాగుంది’ అని అనిపించేటట్లు చేస్తుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …