అధ్యాయం 12, శ్లోకం 9
9.
అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనంజయ ||
తాత్పర్యము : ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్ధుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసికొనుము.
భాష్యము : ఈ శ్లోకములో భక్తి యోగములోని రరెండు వేర్వేరు పద్ధతులను తెలియజేయటం జరిగినది. ఒకటి భగవంతుని పట్ల ఆకర్షణ ప్రేమ కలిగి సేవ చేయుట అయితే, రెండవది అటువంటి ప్రేమ లేనప్పుడు భక్తి యోగ నియమాలను నిష్టతో అభ్యాసము చేసి ఆ ప్రేమను పెంపొందించుకొనుట. బద్ధస్థితిలో మానవుల ఇంద్‌రయాలు భోగవాంఛల వలన అపవిత్ర స్థితిలో ఉంటాయి. నెలసరి జీతము కోసము పనిచేస్తూ ఉంటాడు. అంతే కాని ప్రేమతో కాదు. ప్రతి జీవిలోనూ భగవత్ప్రేమ నిగూఢముగా ఉన్నది. కానీ బద్ధ స్థితిలో భౌతిక సాంగత్యము వలన హృదయము కలుషితమై ఉన్నది. అందువలన గురువును ఆశ్రయించి ఆయన మార్గని ర్దేశకత్వములో భగవత్సేవను నిర్వహించవలసి ఉన్నది. అలా ఉదయాన్నే లేచి, స్నానమాచరించి, భగవంతుని నామాన్ని జపించి, నైవేద్యమునను వండి, భగవంతునికి అర్పించి ప్రసాదమును స్వీకరించవలెను. ప్రత్యేకించి శుద్ధ భక్తుల నుండి భగవద్గీత, భాగవతపు సందేశములను సదా వినవలెను. అట్లు సాధన చేసినచో ఎవరైనా భగవత్ప్రేమను పెంపొందించుకొనవచ్చును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..