అధ్యాయం 13, శ్లోకం 23
23
ఉపద్రష్టానుమంతా చ
భర్తా భోక్తా మహేశ్వర: |
పరమాత్మేతి చాప్యుక్తో
దేహేస్మిన్ పురుష: పర: ||
తాత్పర్యము : అయినను ఈ దేహమూనందు దివ్యప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షకుడును, అంగీకరించువాడును, పరమాత్మగా తెలియబడువాడును అగు దివ్యభోక్తమరియొకడు కలడు.
భాష్యము : ఎవరైతే ఆత్మ, పరమాత్మ ఒక్కరేనని భావిస్తారో వారి అభిప్రాయము తప్పని ఈ శ్లోకము స్పష్టము చేస్తుంది. లేకపోతే కృష్ణుడు ఆత్మ అనకుండా పరమాత్మ అని ఎందుకు సంభోదించెను?
ఆత్మ ఈ ప్రపంచమున ఆనందించుటకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే పరమాత్మ అటువంటి శారీరక కార్యాలలో పాల్గొనదు. పరమాత్మ సాక్షిగా, గమనిస్తూ, అనుమతిస్తూ ఉండే పరమభోక్త. నిజానికి ఆత్మ భగవంతునిలోని విభిన్న అంశ అగుటచే వారిరువురూ ఎంతో సన్నిహిత మిత్రులు. అయితే జీవి తనకున్న చిన్నపాటి స్వేచ్ఛను దుర్వినియోగము చేసుకొనుట వలన అంతరంగమున ఉన్న పరమాత్మ ఇచ్చు సూచనలను పెడచెవిన పెట్టి తప్పుడు ద్రోవను అనుసరించును. భగవంతుడు మాత్రము జీవుడిని తిరిగి తన భగవద్ధామమునకు తీసుకువెళ్ళవలెనని ఎంతో ఆరాటముతో ఉంటాడు. అంతరంగము నుండి పరమాత్మరూపములోనూ మరియు వెలుపల నుండి భగవద్గీత ద్వారా తగిన సూచనలను చేస్తూనే ఉంటాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..