అధ్యాయం 13, శ్లోకం 15
15
సర్వేంద్రియగుణాభాసం
సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ
నిర్గుణం గుణభోక్తృ చ ||
తాత్పర్యము : పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తి లేనట్టివాడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడేగాక, వానికి ప్రభువును అయియున్నాడు.
భాష్యము : జీవుల ఇంద్రియములు అన్నింటిీ కారణభూతుడైనప్పటికీ భగవంతుని ఇంద్రయములు మన ఇంద్రియముల వలె భౌతికములు కావు. జీవుని ఇంద్రియాలు ఆధ్యాత్మికమే అయినా భౌతిక గుణ సంపర్కము వలన భౌతికముగానే పని చేస్తాయి. గుణ అనగా భౌతిక గుణాలు. కాని భగవంతుని ఇంద్రియములు భౌతిక కల్మషము లేనివి. అందువలన భగవంతుని ఇంద్రియాలు నిర్గుణ మని పేర్కొనబడినవి. ఉపనిషత్తులలో ఈ విషయము మరింత స్పష్టముగా తెలియజేయబడినది. భౌతిక ఇంద్రియముల ద్వారా యజ్ఞములో అర్పించే వాటిని ఎలా గ్రహించగలుగుతాడు ? అలాగే భగవంతుడు భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసినవాడు, వాటిని ఎలా చూడగలుగుచున్నాడు? భగవంతుడు అంతటా చరిస్తూ ఉంటాడు. మరి కాళ్ళు లేకపోతే ఎలా నడువగలడు? కాబట్టి భగవంతుడు నిరాకారుడు కాదు. గుణరహితమైన ఇంద్రియాలను కలవాడు. భగవంతుడు ఈ ప్రపంచమునకు వచ్చినా తన ఆత్మమాయతో వచ్చును. కాబట్టి దివ్యుడుగానే ఉండును. మనము కూడా దివ్యస్థితిని చేరుకున్నప్పుడు ఈ విషయాలు మనకు సుస్పష్టమవుతాయి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….