అధ్యాయం 18, శ్లోకం 20
20.
సర్వభూతేషు యేనైకం
భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు
తద్‌జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ||
తాత్పర్యము : జీవులు అసంఖ్యాక రూపములుగా విభజింపబడినను వారి యందు అ విభక్తమై యున్నట్టి ఏకమైన ఆధ్యాత్మిక స్వభావము ఏ జ్ఞానము ద్వారా గాంచబడునో అట్టి జ్ఞానము సత్త్వ గుణ ప్రధానమైనదని తెలిసికొనుము.
భాష్యము : మనము దేవతలను, మానవులను, జంతువులను, పక్షులను, చెట్లు, చేమలను ఇలా అనేక జీవులను చూస్తూ ఉంటాము. వాటన్నిటిలోనూ ఉన్న ఆత్మను చూడగలిగిన వ్యక్తి సత్త్వ గుణములో జ్ఞానమును కలిగి ఉన్నట్లు లెక్క. వేర్వేరు జీవుల యొక్క పూర్వ కర్మానుసారము వేరు వేరు శరీరములను కలిగి ఉన్నా అందరిలోనూ ఉన్నతమైన ఆత్మ ఉంటుంది. శరీరములు నశించినా ఆత్మ నశించదు. భౌతిక జీవనము కారణముగా వేరు వేరు శరీరములను పొందుచూ వచ్చుట వలన ఆత్మ కూడా వేర్వేరని అనిపించవచ్చేమో గాని నిజానికి అన్ని జన్మలలోనూ కొనసాగుచూ వచ్చు ఆత్మ ఒక్కటే. ఇటువంటి నిరాకార జ్ఞానము, ఆత్మను సాక్షాత్కరించుకొనుటలో మొదటి మెట్టు మాత్రమే.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..