Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 5
5.
యజ్ఞదానతప: కర్మ
న త్యాజ్యం కార్యమేవ తత్‌ |
యజ్ఞో దానం తపశ్చైవ
పావనాని మనీషిణామ్‌ ||

తాత్పర్యము : యజ్ఞము, దానము, తపస్సు అనెడి కర్మలను ఎన్నడును త్యజింపరాదు. వానిని తప్పక ఒనరింపవలెను. వాస్తవమునకు యజ్ఞ, దాన, తపములు మహాత్ములను కూడా పవిత్రమొనర్చును.

భాష్యము : వేదములు వివిధమైన యజ్ఞములు, తపస్సులు మరియు దానములను మానవులు చేయవలెనని నిర్దేశించుచున్నవి. ఎందువలన అంటే అవి మనుజుని పవిత్రీకరణ చేసి ఆధ్యాత్మిక జీవనము వైపునకు పురోగమింపచేయుచున్నవి. ఉదాహరణకు వివాహము అటువంటి ఒక పవిత్రీకరణమును ఒనర్చు యజ్ఞము. దానిని సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు కూడా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మనుజుని మనస్సుని క్రమబద్దీకరించి ప్రశాంతపరచి ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. సన్యాసులు ఎప్పటికీ స్త్రీ సాంగత్యము చేయరాదు. కాని సన్యాసాశ్రము క్రింది ఆశ్రములో ఉన్నవారు వివాహము ద్వారా భార్యను స్వీకరించరాదని కాదు. అన్ని నియమితమైన యజ్ఞాల భగవంతుడైన శ్రీ కృష్ణుని పొందుటకు నిర్దేశించడమైనది. అదేవిధముగా, దానము పాత్రుడైనవానికి ఇచ్చుట వలన అది హృదయమును పవిత్రీకరించి ఆధ్యాత్మిక జీవనము యొక్క పురోగతికి తోడ్పడును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement