అధ్యాయం 18, శ్లోకం 2
2.
శ్రీభగవాన్ ఉవాచ
కామ్యానాం కర్మణాం న్యాసం
సన్న్యాసం కవయో విదు: |
సర్వకర్మఫలత్యాగం
ప్రాహుస్త్యాగం విచక్షణా: ||
తాత్పర్యము : శ్రీక ృష్ణ భగవానుడు పలికెను : విషయ కోరికల పరమగు కర్మలను త్యజించుటయే సన్యాసమని విజ్ఞులు పలుకగా, సర్వకర్మల ఫలమును విడుచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుదురు.
భాష్యము : భౌతిక లాభాపేక్షతో కార్యములను చేయరాదు. ఇది భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అయితే ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతికి తోడ్పడే కార్యములను మాత్రము విడనాడరాదు. వేదాలలో మంచి పుత్రుని కోసము, స్వర్గలోకాలకు వెళ్ళుటకు అనేక ఉపాయాలు తెలుపడినవి. కోరికలతో చేయు అటువంటి యజ్ఞాలు మానివేయవలెను. కానీ హృదయ పవిత్రత కోసము మరియు ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కోసము చేయు యజ్ఞములను మానరాదు. వచ్చే శ్లోకాలలో ఈ విషయము మరింత స్పష్టము చేయబ డుతుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..