Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 78
78.
యత్ర యోగేశ్వర: కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధర: |
తత్ర శ్రీర్విజయో భూతి:
ధ్రువా నీతిర్మతిర్మమ ||

తాత్పర్యము : యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేటి ధనుర్థారియైన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇదియే నా అభిప్రాయము.

భాష్యము : కృష్ణార్జునులు యుధిష్టర మహారాజు పక్షాన ఉండటము చేత వారికి విజయము తథ్యమని సంజయుడు నిర్థారించి చెప్పుచున్నాడు. అంతేకాక యుద్ధానంతరము కూడా రాజ్యము వర్థిల్లునని, యుధిష్టరుడు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడే కాక ఎంతో నీతిమంతుడగుటయే దీనికి కారణమని ఇక్కడ భవిష్యవాణి చెప్పబడినది.

శ్రీకృష్ణుడు సర్వ భోగభాగ్యాలను కలిగి ఉంటాడు, అందు వైరాగ్యము ఒకటి. కృష్ణడు దేవాదిదేవుడు అయి ఉండి కూడా అర్జునునికి రథసారథి అగుట అతని వైరాగ్యమునకు ఒక మచ్చుతునక మాత్రమే. కొంత మంది తెలివి తక్కువ వారు భగవద్గీతను కేవలము ఇద్దరు స్నేహితుల మధ్య రణ భూమిలో జరిగిన సంవాదము గానే భావించుదురు. అటువంటి సాధారణ సంభాషణ శాస్త్రము కానేరదు. భగవద్గీత అత్యుత్తమ నీతిని బోధిస్తుంది, ప్రత్యేకించి ‘మన్‌ మనా భవ మద్భక్త:’ అనే వాక్యము. ఇక మిగిలిన ఉపదేశములన్నీ దీనికే దారితీయగా, వాటన్నింటినీ మించి ఆఖరి ఉపదేశమైన, ‘కృష్ణున్ని శరణు పొందుట’ అన్ని ధర్మములనకు నీతి నియమాలకు తుది మెట్టు. భగవద్గీతలో ఇదే అత్యంత గుహ్యతమమైన జ్ఞానము మరియు పద్దెనిమిదవ అధ్యాయపు సారము.

శ్రీకృష్ణుడు పరమ సత్యము. చూడటానికి భగవంతుడు, జీవుడు, భౌతిక ప్రకృతి మరియు కాలము వేరు వేరుగా కనిపించినా అవన్నీ కేవలము పురుషోత్తముడు మరియు ఆయన అంవలు, శక్తులు మాత్రమే. అయితే భగవంతుడు తన శక్తులకు భిన్నముగా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. చైతన్య మహాప్రభువు బోధించిన ‘అచింత్య బేధా అబేధ’ తత్త్వమే పరమ సత్యాన్ని పూర్తిగా వివరించగలదు. జీవుడు తనకున్న కొద్దిపాటి స్వేచ్ఛను కృష్ణుని ఆదేశమును పాటించుటకు వినియోగించినట్లయితే అతడు తిరిగి కృష్ణుని సేవకుడై తన సహజ స్థితిలో నెలకొంటాడు.

- Advertisement -

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
మోక్షసన్న్యాసయోగోనామ అష్టాదశోధ్యాయ: ||
ఓం శాంతి: శాంతి: శాంతి:
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement