అధ్యాయం 18, శ్లోకం 65
65.
మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి సత్యం తే
ప్రతిజానే ప్రియోసి మే ||
తాత్పర్యము : సర్వదా నన్నే చింతింపుము. నా భక్తుడవగుము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను.
భాష్యము : అత్యంత గుహ్యతమమైన జ్ఞానమేమనగా ”జీవుడు శ్రీ కృష్ణుని శుద్ధభక్తుడై సదా ఆయననే స్మరిస్తూ, ఆయన కోసము కార్యములు చేయవలెను”. అలా అని ధ్యానము చేస్తూ కూర్చొనరాదు. దిన చర్యలను కృష్ణునితో సంబంధముగా చేయవలెను. తన జీవితాన్ని ఎలా మలచుకొనవలెనంటే ఇరవై నాలుగు గంటలూ కృష్ణుణ్ని మరచి పోలేని విధముగా ఉండవలెను. అటువంటి సంపూర్ణ కృష్ణ చైతన్య వ్యక్తి కృష్ణుని ధామమును చేరుటే కాక అతనికి కృష్ణుని సాంగత్యములో ముఖాముఖీ సేవ చేసే భాగ్యము కలుగుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ వాగ్దానము చేయుచున్నాడు. అర్జునుడు తన ప్రియ మిత్రుడు కనుక శ్రీకృష్ణుడు ఇటువంటి గుహ్యతమమైన జ్ఞానాన్ని తెలియజేయుచున్నాడు. మనము కూడా అర్జుననుని అడుగు జాడలలో నడచినట్లైతే శ్రీకృష్ణునికి స్నేహితులమై అర్జునని వలే జీవిత పరమార్థాన్ని పొందగలుగుతాము. ఈ శ్లోకము ప్రకారము మనము కూడా అర్జునుని ముందు నిలుచుని ఉన్న శ్రీకృష్ణుని రూపము పైననే మనస్సును నిలుపవలెను గాని వేరే భగవదవతారముల పైన కాదు. ఇదే అత్యంత గుహ్యతమ జ్ఞానము.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..