Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 8
8
అమాని త్వమదంభిత్వమ్‌
అహింసా క్షాంతిరార్జవమ్‌ |
ఆచార్యోపాసనం శౌచం
స్థైర్యమాత్మవినిగ్రహ: ||

తాత్పర్యము : వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికగురువు నాశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము.

భాష్యము : ఈ శ్లోకముతో మొదలుగా రాబోవు అయిదు శ్లోకాలలో శ్రీ కృష్ణుడు ‘జ్ఞానమార్గము’ను వివరించనున్నాడు. అనగా జీవుడు 24 మూలకాలతో కూడుకొని ఉన్న ఈ భౌతిక బంధనము నుండి ఎలా బయటపడగలడో ఇక్కడ తెలియజేయటమైనది. దానికి ముఖ్యముగా ఆచార్యోపాసన ద్వారా అనన్య భక్తి చేసినట్లయితే మిగిలినదంతా సునాయాసముగా అర్థమవుతుంది. ఇక వాటిని వరుసలో చర్చిద్ధాము.

1.అమానిత్వము : అనగా వేరే వారి నుండి గౌరవాన్ని ఆశించకుండా ఉండటము. నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకున్న వారే దీనిని పాటించగలుగుతారు.
2.అడంబిత్వము : అందరూ నన్ను గొప్పవ్యక్తి, భక్తుడు అనుకోవాలని, తనభక్తి ప్రపత్తుల గురించి గొప్పగా చెప్పుకొనుట లేదా అడంబరపు భక్తిని ప్రదర్శించుట. అర్హత లేకపోయినా నా గురువుగా చలామణీ అగుటకు ప్రయత్నించుట.
3.అహింస:భౌతిక బంధనాలలో చిక్కుకుని సతమతమయ్యేవారికి సరైన జ్ఞానాన్ని కలుగజేయుట.
4.క్షాంతి:ఆధ్యాత్మిక జీవి తములో పురోగతి కోసము వేరేవారి నుండి వచ్చు నిందలను, అమర్యాదను ఓర్చుకొనుట.
5.ఆర్జవము:శత్రువుకు సైతము నిస్సంకోచముగా సత్యమును పలుకగలుగుట, అనగా కపటత్వము లేకుండుట.
6.ఆచోర్యోపాసము: ఆచార్యుని మార్గదర్శకు అత్యంత ఆవశ్యకమని గుర్తించుట మరియు వారిని సేవించుట.
7.శౌచము: స్నానమాచరించుట ద్వారా బహిరంగముగానూ, హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే అను మహామంత్రము జపించుట ద్వారా అంతరంగము నందు కూడా స్వచ్ఛముగా ఉండుట.
8.స్థైర్యము : ఆధ్యాత్మిక జీవితములో పురోగమించాలనే సంకల్పమును కలిగిఉండుట.
9.ఆత్మ వినిగ్రహము : ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలమైన దానిని స్వీకరించుట, ప్రతికూలమైన దానిని వదిలిపెట్టుట.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement