Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 47
47.
శ్రేయాన్‌ స్వధర్మో విగుణ:
పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌ |
స్వభావనియతం కర్మ
కుర్వన్నాప్నోతి కిల్బిషమ్‌ ||

తాత్పర్యము : పరధర్మమును స్వీకరించి దానిని సమగ్రముగా ఒనరించుట కన్నను అసమగ్రముగా ఒనరించినను స్వధర్మమునందే నియుక్తమగుట మేలైనది. గుణముల ననుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడును పాపఫలములచే ప్రభావితములు కావు.

భాష్యము : ప్రతి ఒక్కరూ తమ తమ స్వభావములను అనుసరించి బాధ్యతలను స్వీకరించవలెనని గత శ్లోకములలో వివరించుట జరిగినది. అటువంటి బాధ్యతా నిర్వహణలో లోపములు ఉండవచ్చును. ఉదాహరణకు క్షత్రియుడు శత్రువులను జయించుటకు హింసకు పాల్పడవలసివ చ్చును. అదేవిధముగా వైశ్యుడు లాభము కొరకు అబద్ధములు చెప్పవలసి వచ్చును. అయితే ఈ కార్యములు భగవంతుని కొరకు నిర్వహింపవలసి ఉన్నది. అట్లు చేసినచో తమ తమ కార్యములలోని లోపముల వలన పతనము చెందక ఉద్దరింపబడుదురు. అర్జునుడు కూడా క్షత్రియ ధర్మమైన యుద్ధము ద్వారా దుష్ఫలితములు వచ్చునని భావించి యుద్ధము చేయుటకు నిరాకరించెను. కానీ భగవంతుడు యుద్ధమును చేయమని చెప్పుట వలన అర్జునుడు యుద్దము చేయుట అనేది పతనమునకు దారి తీయదు. అనగా ప్రతి ఒక్కరూ తమ స్వభావమును అనుసరించి శాస్త్రములచే తెలుపబడిన బాధ్యతలను స్వీకరించి భగవంతుని కోసమే వాటిని చేయవలసి ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement