Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 6,7
6.
మహాభూతాన్యహంకారో
బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇంద్రియాణి దశైకం చ
పంచ చేంద్రియగోచరా: ||

7.
ఇచ్ఛాద్వేష: సుఖం దు:ఖం
సంఘాతశ్చేతనా ధృతి: |
ఏతత్‌ క్షేత్రం సమాసేన
సవికారముదాహృతమ్‌ ||

6–7తాత్పర్యము : పంచ మహాభూతములు, మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, ఐదు ఇంద్రియార్థములు, కోరిక, ద్వేషము, సుఖము, దు:ఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మ క్షేత్రముగను, దాని అంత: ప్రక్రియలుగను భావింపబడుచున్నవి.

భాష్యము : గొప్ప ఋషుల ప్రకారము, వేదాలు,వేదాంత సూత్రాల ప్రకారము ఈ ప్రపంచము ముఖ్యముగా ఇరువది నాలుగు మూలకాలచే నిర్మింపబడినది. వాటి వివరాల జాబితా ఇలా ఉంది. అయిదు పంచమహాభూతాలు అనగా భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశము. ఇక బుద్ధి, అహంకారము మరియు అవ్యక్తరూపములో ఉండే త్రిగుణ ప్రకృతి. అయిదు జ్ఞానేంద్రియాలు అనగా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మము. అయిదు కర్మేంద్రియాలు అనగా వాక్కు, కాళ్ళు, చేతులు, గుదము మరియు జననేంద్రియములు. ఇక ఇంద్రియములకు ఉన్నతమైనది మనస్సు. అయిదు ఇంద్రియార్ధములు, అనగా వాసన, రుచి, రూపము, స్పర్శ మరియు శబ్దము. ఇక వాంఛించుట, ద్వేషించుట, సుఖము దు:ఖములనునవి పంచ భౌతిక మూలకాల పరస్పర ప్రక్రియల వలన కలుగునవి. జీవ లక్షణములు చైతన్య రూపమున కనిపించును. అలాగే విశ్వాసము, ఇవన్నీ సూక్ష్మ శరీరమైన మనస్సు, బుద్ధి, అహంకారము యొక్క వ్యక్త రూపములు. శరీరము లేదా క్షేత్రము పుట్టుట, పెరుగుట, స్థిరత్వము, జన్మనిచ్చుట, క్షీణించుట మరియు మరణించుట అను ఆరు మార్పులకు గురి అగును. కాబట్టి ఈ ఇరువది నాలుగు అంశాలు కూడా భౌతికమైన అశాశ్వతమైన క్షేత్రానికి సంబంధించినవి. అయితే క్షేత్రాన్ని తెలిసిన క్షేత్రజ్ఞుడు మాత్రము వీటన్నింటికీ భిన్నముగా నుండును. తాత్పర్యము : వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికగురువు నాశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ..

Advertisement

తాజా వార్తలు

Advertisement