Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 46
46.
యత: ప్రవృత్తిర్భూతానాం
యేన సర్వమిదం తతమ్‌ |
స్వకర్మణా తమభ్యర్చ్య
సిద్ధిం విందతి మానవ: ||

తాత్పర్యము : సర్వ జీవులకు కారణమైనవాడును మరియు సర్వత్ర వ్యాపించియున్నవాడును అగు భగవానుని అర్పించుచు, తన విద్యుక్త కర్మను ఒనరించుట ద్వారా మనుజుడు పూర్ణత్వమును బడయగలడు.

భాష్యము : గడచిన అధ్యాయాలలో జీవులు భగవంతుని యందు భాగములై వ్యక్తులని తెలుసుకొని ఉన్నాము. జంతువులు, మానవులు, దేవతలతో సహా ప్రతి జీవుని యందు భగవంతుడు పరమాత్మ రూపంలో విస్తరించి ఉన్నాడు. కాబట్టి, ఆ దేవదేవునిలో భాగముగా అందరూ సంపూర్ణ కృష్ణ చైతన్యముతో ఆయనను సేవించవలెనని ఈ శ్లోకము సూచించుచున్నది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యమును చేయుచుందురు. అది భగవంతుని వలననే సాధ్యమగుచున్నదని భావించవలెను. కాబట్టి ప్రతి కార్యము వలన వచ్చు ఫలితములతో ఆ భగవంతుని ఆరాధించవలసి ఉన్నది. ఆ విధముగా చేయు భక్తుడ్ని ఉద్దరించు భాద్యత భగవంతుడే స్వీకరించును. అదే మానవ జీవిత పరిపూర్ణత!

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement