అధ్యాయం 18, శ్లోకం 28
28.
అయుక్త: ప్రాకృత: స్తబ్ధ:
శఠో నైష్కృతికోలస: |
విషాదీ దీర్ఘసూత్రీ చ
కర్తా తామస ఉచ్యతే ||
తాత్పర్యము : భౌతికాసక్తుడును, మొండితనము కలవాడును, మోసము చేయువాడును, ఇతరులను అవమానించుట యందు దక్షుడును, సోమరియును, సదా చింతాక్రాంతుడను, వృధా కాలవ్యయమును చేయువాడును సదా శాస్త్ర నిర్దేశములకు విరుద్ధముగా కర్మ నొనరించువాడును తమోగుణ కర్తయని చెప్పబడును.
భాష్యము : ఎటువంటి కర్మము చేయదగినదో, ఎటువంటి కర్మ చేయరానిదో శాస్త్ర నిర్దేశములందు మనము చూడవచ్చును. అట్టి వైదిక గ్రంథముల నిర్దేశములందు మనము చూడవచ్చును. అట్టి వైదిక గ్రంథముల నిర్దేశములను లెక్క జేయని వారు చేయకూడని కర్మలనే చేయుచు సాధారణముగా భౌతికాసక్తులై యుందురు. వారు ప్రకృతి గుణములను అనసరించియే వర్తితురు గాని శాస్త్ర నిర్దేశములను అనుసరించి కర్మను చేయరు. సాధారణముగా అట్టి కర్తలు మృదు స్వభావులై ఉండక మోసకారుల మరియు ఇతరులను అవమానపరచుట యందు నేర్పరులై యుందురు. సోమరులగుటచే వారు నిర్వహింపవలసిన కార్యములు అనేకము ఉన్నప్పటికీ వాటిని సక్రమముగా పూర్తి చేయక తరువాత చేయవచ్చునని ప్రక్కన పెట్టుదురు. తత్కారణముగా వారెల్లపుడును చింతాక్రాంతులై ఇచ్చిన పనిని ఆలస్యము చేయుట యందు గొప్ప నేర్పరులై ఉందురు. అట్టి కర్తలు తమోగుణము నందు స్థితులైనట్టివారు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..