అధ్యాయం 12, శ్లోకం 20
20.
యే తు ధర్మ్యామృతమిదం
యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమా
భక్తాస్తే తీవ మే ప్రియా: ||
తాత్పర్యము : నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తియోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీనియందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు.
భాష్యము : ఈ అధ్యాయములో రెండవ శ్లోకము, ‘మయ్యావేశ మనో యే మాం’ అనగా మనస్సు నాపై నిలుపుము, నుంచి ఈ చివరి శ్లోకమైన’యేతు ధర్మామృతమిదం’ అనగా ఈ శాశ్వతమైన ధర్మము వరకు భగవంతుడు తనను చేరుకొనుటకు గల భగవత్సేవామార్గములను వివరించియున్నాడు. ఆ మార్గములన్నీ భగవంతునికి ఎంతో ప్రియము కనుక అందు నియుక్తుడైన భక్తుడిని అతడు స్వీకరిస్తాడు. ఈ అధ్యాయములో అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా కృష్ణుడు భగవద్భక్తి మార్గమే ఉత్తమమని నిరూపణ చేసెను. సరైన సాంగత్యములో శ్రద్ధను పొంది, గురువును ఆశ్రయించి ఆయన మార్గదర్శకత్వంలో శ్రవణ కీర్తనాదులను చేస్తూ నియమ ని ష్టలతో భగవద్భక్తిని కొనసాగించుట ఒక్కటే సరైనదని వివరించెను. శుద్ధభక్తుని సాంగత్యము లభించనంతవరకు పరోక్ష మార్గాలైన, త్యాగము, జ్ఞానము, ధ్యానము, నిరాకారతపస్సు కొంత మేలు చేయవచ్చును. అయితే ప్రత్యక్ష భగవద్భక్తి మార్గము కోరుకున్న త్వరిత గతిన భగవంతున్ని పొందవచ్చును. భగవద్గీతలోని ఈ ఆరు అధ్యాయాలలో తెలుపబడిన భగవత్సేవా మార్గము అన్నింటికంటే సులభసాధ్యమైనది. దీనిని పాటించినట్లయితే భగవంతుని కృప వలన మిగిలిన భౌతిక అవసరాలన్నీ సహజముగానే సమకూర్చబడతాయి.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
భక్తియోగో నామ ద్వాదశోధ్యాయ: ||
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..