Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 18,19

18.
సమశ్శత్రౌ చ మిత్రే చ
తథా మనావమానయో: |
శీతోష్ణసుఖదు:ఖేషు
సమస్సంగవివర్జిత: ||

19.
తుల్యనిందాస్తుతిర్మౌనీ
సంతుష్టో యేన కేనచిత్‌ |
అనికేత: స్థిరమతి:
భక్తిమాన్‌ మే ప్రియో నర: ||

తాత్పర్యము : శత్రుమిత్రుల యెడ సమాభావము కలిగినవాడును, మానావమానములందు, శీతోష్ణములందు, సుఖ దు:ఖములందు, నిందాస్తులందు సమబుద్ధి కలిగినవాడును, అసత్సంగము నుండి సదా విడివడియుండువాడును, సదా మౌనియైనవాడును, దేనిచేతనైనను సంతుష్టి నొందెడివాడును, నివాసమేదైనను లెక్కచేయనివాడును, జ్ఞానమునందు స్థితుడైనవాడును, నా భక్తియుత సేవయందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు.

భాష్యము : శుద్ధ భక్తుడు చెడు సాంగత్యానికి ఎప్పుడూ దూరముగా ఉంటాడు. మానవ సమాజములో కొన్నిసార్లు పొగడ్తలు, మరికొన్నిసార్లు అవమానములు తప్పవు. భక్తుడు ఎంతో ఓపికతో ఉంటూ మాన, అవమానములకు, సుఖ దు:ఖాలక అతీతముగా ఉంటాడు. కృష్ణునికి సంబంధించినది తప్ప వేరేది మాట్లాడడు కనుక అతడు మౌనమును కలిగి ఉంటాడు. కృష్ణుని కొరకు మాత్రమే మాట్లాడుట మౌనమే అవుతుంది. భక్తుడు అన్ని సందర్భాలలోనూ ఆనందంగా ఉంటాడు. కనుక విందు లభించినా, లభించకున్నా తృప్తి చెందుతాడు. అలాగే చెట్టు క్రింద ఉండవలసి వచ్చినా, రాజప్రాసాదాలను అందుకున్నా తన నివాసము పట్ల ఆకర్షితుడు కాడు. తనకు సరైన జ్ఞానము మరియు లక్ష్యము ఉండుటచే అతడు స్థిరముగా నుండును. ఇలా భక్తుడు భగవద్భక్తి ద్వారా పైన చెప్పబడిన లక్షణాలన్నింటినీ పెంపొందించుకొనవలెను. అప్పుడే అతడు శుద్ధభక్తుడనబడతాడు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement