అధ్యాయం 12, శ్లోకం 17
17.
యో న హృష్యతి న ద్వేష్టి
న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ
భక్తిమాన్ యస్స మే ప్రియ: ||
తాత్పర్యము : ఉప్పొంగుట గాని దు:ఖించుటగాని తెలియనివాడును, శోకించుట గాని వాచించుట గాని ఎరుగనివాడు. శుభాశుభములు రెండింటిని త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు.
భాష్యము : శుద్ధభక్తుడు భౌతికమైన లాభనష్టాలకు అతీతముగా ఉంటాడు. అతడు పుత్రుణ్ని కనాలనో లేక శిష్యుడ్ని తయారు చేయాలనో ఉబలాటపడడు. అంతేకాక వారిని పొందుటలేదని నిరాశచెందడు. తనకు ఇష్టమైన దానిని కోల్పోయినా అతడు దు:ఖించడు. అలాగే తాను కోరుకున్నది లభించకపోయినా అతడు బాధపడడు. అతడు శుభ, అశుభ పాప కార్యములకు అతీతముగా ఉంటాడు. కృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి సాహసాన్ని చేయుటకైనా వెనుకాడడు. ఎటువంటి ఆటంకమూ అతని భక్తిని నిరుత్సాహపరచదు. అటువంటి భక్తుడు కృష్ణునికి చాలా ప్రియుడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..