దేవీ నవరాత్రులలో మూడవ రోజైన తదియనాడు అమ్మవారిని గాయత్రి అవతారంలో అర్చిస్తాము. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో కూడిన అయిదు ముఖాలతో శంఖము. చక్రము, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రిదేవిని త్రిశక్తి స్వరూపంగా భావిస్తారు. సమస్త మంత్రాలకు అధిష్టాన దేవత గాయత్రిదేవి. విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రాన్ని లోకానికి అందించారు. ఈ తల్లి వేదమాత. ఈ మాతను గాయత్రీ కవచంతో ఉపాసించేవారికి సర్వత్రా సిద్ధి లభిస్తుంది. గాయత్రి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రము, కనకాంబరాలతో అలంకరించాలి. ఈమెకు పాయసం, అల్లపు గారెలు నివేదన చేయాలి.
గాయత్రీ ధ్యానమ్
ఓం ముక్తావిద్రువ హేమ నీలధవళాచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణౖ?
ర్యుక్తామిన్దునిబద్ధ రత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికామ్?
గాయత్రీం వరదాభయాంకుశా కశా పాశం కపాలం గదాం?
శంఖం చక్రమదారవింద యుగళం హస్తైర్వహంతీం భజే?
శ్రీశైలంలోని భ్రమరాంబ అమ్మవారు ఈ రోజు చంద్రఘంటగాను, విజయవాడ కనకదుర్గమ్మ గాయత్రి రూపంలోను దర్శనమిస్తారు. అర్థాకృతిలోని చంద్రరేఖను శిరస్సుపై ధరించే రూపం చంద్రఘంట. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. ఈమెను శరణు జొచ్చిన వారికి ఎల్లప్పుడూ ఆభయ ఘంట మ్రోగుతూ విజయం ప్రసాదిస్తుంది.
చంద్రఘంట శ్లోకము
శ్లో.పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా!
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా!!
– డా. దేవులపల్లి పద్మజ
98496 92414