తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కవచాలను ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.
అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను కల్యాణమండపంలోకి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వహించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.
సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి స్వామివారు ఆలయ ప్రాంగణంలో ఊరేగనున్నారు.
శాస్త్రోక్తంగా తులసి మహత్యం ఉత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు బంగారు వాకిలి చెంత సింహాసనంపై వేంచేపు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేశారు.