Saturday, November 23, 2024

క్షమకు ప్రతిరూపం

క్షమయా ధరిత్రి అంటే భూదేవ ంత ఓర్పు. భూదేవికి ఓర్పు ఎక్కువని భావిస్తారు. తనని కాళ్లతో తొక్కినా, తవ్వినా ఆమె భ రిస్తుందనే ఉద్దేశంతో అలా అంటారు. స్వాభావికంగా స్త్రీలకు కూడా ఓర్పు ఎక్కువని ఈ పోలిక చెబుతారు. ద్రౌపది ఒక సందర్భంలో చూపిన ఓర్పు అటువంటిదే. ఇది భారతంలోనిదే. అదేమిటో చూద్దాం.
మహాభారత యుద్ధంలో సర్వ నాశనం అయిన దుర్యోధనుడిని సంతృప్తిపరచడానికి అశ్వత్థామ అతి కిరాతకంగా పాండవుల పుత్రులైన ఉప పాండవులను నిద్రిస్తుండగా వధించాడు. బాలలను నెత్తుటి మడుగులో చూసిన పాండవులు, ద్రౌపదీ దేవి దు:ఖానికి అంతులేదు. తన పుత్రులందరినీ పోగొట్ట్టుకుని విలపిస్తున్న ద్రౌపదిని ఓదారుస్తూ అర్జునుడు ”ఇంత దారుణమైన పని చేసిన ఆ అశ్వత్థామను నీ వద్దకు లాక్కు వస్తాను” అంటూ పారిపోతున్న ఆ ద్రౌణి వెనకాల పడ్డాడు. శ్రీకృష్ణార్జునుల రథం సమీపిస్తుండటం చూసిన అశ్వత్థామ ప్రాణ రక్షణ కోసం బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం తప్ప అన్యమేదీ తనను కాపాడజాలదని రథం ఆపి, శుచిర్భూతుడై ఆచమించి మంత్ర ప్రయోగం చేశాడు. ప్రళయ కాల రుద్రుని మాదిరి సమీపిస్తున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసి శ్రీకృష్ణుడు ప్రతిబ్రహ్మాస్త్త్ర ప్రయోగం చేయమని అర్జునుని ఆజ్ఞాపించాడు.
అర్జునుడు కూడా శుచి అయి, ఆచమించి, పరమాత్మకు ప్రదక్షిణం చేసి బ్రహ్మాస్త్త్ర ప్రయోగం చేశాడు. ఆ రెండు అస్త్రాలు సూర్యాగ్నుల వలె ప్రజ్వరిల్లాయి. వాటి ప్రభావం చతుర్దశ భువనాలను దహించగలదని తెలిసి న కృ ష్ణుడూ, వ్యాసుడు లోక సంరక్షణార్థం వాటిని ఉపసంహరించమని ఇద్దరికీ హితవు చెప్పారు. అర్జునుడికి ఉపసంహారం తెలుసు. అశ్వత్థామకు ఉపసంహారం తెలియదు. అందుచేత అతడు దానిని ఉత్తరా గర్భంలో ఉన్న పాండవుల వంశాంకురం అయిన పరీక్షిన్మహారాజు పైకి మళ్ళించాడు. అతనిని ఆ ప్రభావం నుంచి శ్రీ కృష్ణ పరమాత్మ కాపాడాడు. అయితే మృత శిశువుగా పుట్ట్టిన పరీక్షిత్తును శ్రీ కృష్ణుడు పునర్జీవితుని చేయడం వంటివన్నీ జరిగాయి. అయితే ఆ తర్వాత అశ్వత్థామను పాండవులు బంధించి ద్రౌపదీ దేవి ముందుకు తెచ్చారు. అశ్వత్థామ ద్రౌపది ముందు సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయాడు. పరాన్ముఖుడైన అశ్వత్థామను చూసి అంత బాధలోనూ కూడా ద్రౌపది నమస్కరించి, ”నాయనా నీ తండ్రిగారైన ద్రోణాచార్యులు వద్ద మా మగవారు విద్యాభ్యాసం చేశారు. పుత్ర రూపంలో ఉన్న ద్రోణుడవు నీవు. మాకు గురుతుల్యుడవైన నీవు ఇలా నీ శిష్యనందనులను దారుణంగా వధించడం ధర్మమా? హాని కలిగించినా ఎదుర్కోలేని పసివాళ్లను, నీకెన్నడూ అపకారం చేయని అందాలు చిందే శిశువులను నిద్రిస్తుండగా చంపడానికి నీకు చేతులెలా వచ్చాయి. ఓ గురుపుత్రా! ఇక్కడ నేను పుత్రుల కోసం ఏడుస్తున్నట్టే అక్కడ నీ తల్లి కృపి నీ కోసం ఎంతగా విలపిస్తున్నదో. అర్జునుడు బంధించి తీసుకుపోయాడన్న వార్త వినగానే ఎంత పరితాపం చెందినదో కదా” అని శ్రీకృష్ణార్జునుల వైపు చూసి ”ద్రోణాచార్యులవారు స్వర్గస్థులైనా ఆతని మీదే ఆశలు పెట్టుకుని జీవిస్తున్నది ఆ సాధ్వి కృపి. నాలాగే పిల్లవాడి కోసం ఎంతో బాధపడుతూ ఉంటుంది. గురు పుత్రుడైన ఆ అశ్వత్థామను వదలివేయండి! గురు పుత్రుని వధించటం ధర్మం కాదు” అన్నది.
ఈ ప్రకారం ద్రౌపదీ దేవి ధర్మసమ్మతంగా, దాక్షిణ్య సహి తంగా, నిష్కపటంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా ప్రశంసనీ యంగా పలికింది. పాంచాలి మాటలు విని ధర్మరాజు అవి ఎంతో ఉచితంగా ఉన్నాయని భావించాడు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు ఆమె ఔన్నత్యాన్ని పొగిడాడు. అక్కడున్న వారందరూ ఆమె ఉచితజ్ఞతకు అచ్చెరువొందారు. ఒక్క భీమసేనుడు మాత్రం ”కన్న కొడుకులను క్రూరంగా చంపిన వాడు కళ్లముందున్నా కోపం తెచ్చుకోకుండా విడవమంటుందేమిటి? స్వాభావికంగా దయ ఉన్నవాడే బ్రాహ్మణుడు, కానీ ఇలా పైశాచికంగా ఘోర కృత్యం చేసిిన ఈ అశ్వత్థామ క్షమార్హుడు కాదు” అం టూ అతని పైకి దూకాడు. కోపంలో ఏమి చేస్తాడో అని గురు పుత్రునికి అడ్డుగా నిలబడింది ద్రౌపది. అప్పుడు శ్రీకృష్ణుడు కలగజేసుకుని ఇలా ధర్మబోధ చేశాడు. ”శిశు ఘాతకుడూ, కిరాతకుడూ అయిన ఈ అశ్వత్థామ ముమ్మాటికీ చంపదగినవాడే. కానీ గురు పుత్రుడు, విప్రుడు అవడం వల్ల్ల వీనిని చంపకుండా శిక్షించాలి. ఒక వీరుడికి శిరోముండనం చావుతో
సమానం. ఈతని కేశాలు ఖండించి అవ మానించి పంపుదాం” అన్నాడు. ఆ విధంగా అర్జునుడు అతని కేశాలు ఖండించి తల మీద ఉన్న దివ్య (జ్ఞాన) మణిని తీసుకుని అవమానించి పంపివేశాడు. అనంతరం చనిపోయిన బంధువు లందరికీ దహన సంస్కారాలు చేసి పొంగిపొరలే దు:ఖాన్ని ది గమింగుకుని మరణించిన వారికి తిలోదకాలిచ్చారు పాండవులు. ద్రౌపది పుట్టెడు పుత్ర శోకంతో ఉన్నా భూదేవంత ఓర్పుతో క్షమాభిక్ష పెట్టింది కాబట్టే అటువంటివారిని దృష్టిిలో పెట్టుకునే క్షమయా ధరిత్రి అనే మాట పుట్టుకొచ్చి ఉంటుంది.

రావుల రాజేశం
98488 11424

Advertisement

తాజా వార్తలు

Advertisement