సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అను ఈ నలుగురు బ్రహ్మదేవుని మనస్సు నుండి జన్మించారు. ఇదే పరమాత్ముని యొక్క మొదటి అవతారము. తండ్రి అయిన బ్రహ్మ వీరిని సృష్టిని పెంచమని కోరగా పుట్టుకకు పరమార్థం శరీర పోషణ కాదు ఆత్మ పోషణ అని వీరు పరమాత్మ ధ్యానంలో మునిగి బ్రహ్మచర్యను దీక్షగా స్వీకరించారు. వయస్సు పెరిగిన కొద్దీ దుర్గుణాలు, దురాలోచనలు, దురూహలు పెరుగుతాయని తమ వయస్సు ఎప్పటికీ 5 సంవత్సరాలుగానే ఉండాలని బ్రహ్మ నుండి వరం కోరుకున్నారు. నిరంతరం అఖండితమైన బ్రహ్మచర్యాన్ని పాటించి ఇతరులు ఆచరించలేని తపస్సును చేసి తపస్సు, బ్రహ ్మచర్యమే ముక్తికి ప్రధాన ద్వారాలని ఉద్బోధించారు. పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా తాము పాత్రలుగా వచ్చి వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ట అవతారాలకు కావాల్సిన పూర్వ రంగాన్ని సిద్ధం చేసారు. సనకాదులు, వైకుంఠానికి వచ్చినపుడు ద్వార పాలకులను రాక్షసులుగా పుట్టమని శపించగా వారు హిరణ్యకశిప – హిరణ్యాక్ష, రావణ – కుంభకర్ణ, శిశుపాల – దంతవక్రులుగా పుట్టగా వారిని స్వామి వరాహ, నారసింహ, రామ, కృష్టాది అవతారాలతో సంహరించారు. భగవానుని అభిప్రాయానికి అనుగుణంగా వారి ఆజ్ఞను పాటించడమే నిజమైన భగవానుని సేవ అని సనకాదుల ఉపదేశం. బ దరికాశ్రమంలో నారదమహర్షికి భాగవత సప్తాహాన్ని ఉపదేశించి భాగవత సప్తాహక ప్రచారాన్ని గావించిన వారు సనకాదులు. రుషభునికి, భరతునికి, పృథు చక్రవర్తి, ఇత్యాదులకు సమయానుగుణ ంగా తత్త్వోపదేశము చేసి ప్రజలకు ధర్మబద్ధమైన పరిపాలన అందజేసిన వీరిని ప్రతీరోజు లేవగానే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అని నోరారా పలికితే సకల బుద్ధి దోషాలు, పాపాలు నశిస్తాయి.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి