పుణ్యపాపములు
మనము పూర్వజన్మలో చేసిన కర్మల ఫలమును అనుభవించుటకే పుట్టుచున్నాము అనునది వేదశాస్త్రములు తెలుపుచున్నవి. మంచికర్మలనాచరించినచో మంచిజన్మ అనగా దేవతలుగా, గంధర్వులుగా, యక్షులుగా, విద్యాధరులుగా పుట్టుచుందుము. చెడుకర్మల నాచరించితే ఒక హద్దులో చెడు ఆచరిస్తే అనగా కోరి కర్మలనాచరించినచో మానవులుగా పుట్టుతాము. అందులోను పరోపకారము, పరులను రక్షించుట వంటి ధర్మాలను ఆచరించితే ఉత్తమ జ్ఞానము కలవారిగా, సంపద కలవారిగా, అధికారము, అంగబలము, అర్థబలము కలవారిగా పుడతాము. అధర్మాలను, పరులను హింసించుట, పరుల ద్రవ్యమును హరించుట, దూషించుట వంటివి చేస్తే పశుపక్ష్యాదులుగా పుట్టుతాము అంటారు. దీనినే ఒక్కమాటతో చెప్పాలంటే పుణ్యము చేస్తే మంచి బ్రతుకు, పాపము చేస్తే దుఃఖమయమైన బ్రతుకు లభిస్తుంది. ‘పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే’ అనునది శాస్త్రవాక్యము. పూర్వజన్మలో ఆచరించిన పాపమే వ్యాధిరూపముగా బాధించును అని భావము. అట్లే ‘ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః’ అని కూడా అంటారు. మనకు పశువులు కాని, సంపదలు కాని, భార్య లేక భర్త, పుత్రులు, ఇల్లు, ఇతర భోగములు మనము పూర్వజన్మలో పెంచుకున్న, పంచుకున్న అనుబంధముతోనే లభిస్తాయనేది భారత వాక్యము. ముక్తసరిగా మన జీవనవిధానాన్ని శాసించేది మనము ఆచరించిన, ఆచరించుచున్న పుణ్యపాపములు మాత్రమే అని అంటారు.