Saturday, November 23, 2024

‘ఓ భక్తు(ని) వేదన’

”స్వామీ!శ్రీహరీ! శ్రీ మహావిష్ణూ! శ్రీనివాస! శ్రీ మహాలక్ష్మీ ప్రియా! నీవు తొలి ఏకాదశి ఐన శయనేకాదశి నాడు యోగనిద్రలోకి వెళా ్తవని, మరల కార్తిక ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొంటావని, నీ విధియైన స్థితికారకత్వాన్ని తిరిగి స్వీకరిస్తావని, మమ్మల్ని ఏలు కోవడం తిరిగి ఎనిమిది నెలల కాలం (మరల తొలిఏకాదశి దాకా) తర్వాత చేస్తావని, అందాకా మా అష్టకష్టాలను మేమే పడాలని, నీవు యోగనిద్రలో ఉన్నప్పుడు మరింత విజృంభించే రోగాలు, పీడలు, రుగ్మతలు, సుస్తీలు మేమే నిన్ను తల్చుకుంటూ ఎదుర్కోవాలనే సంగతి చదివి, విని, చూసి, నీకు నీ చరణ కమలాలకు అర్పిస్తున్న నా (ని)వేదన. పూర్తిగా యోగనిద్రలోకి జారకముందే ఓసారి నా వేదన విన్పించుకోవా కమల ప్రియా! నీ గురించి నేను తెల్సుకున్నది చెప్పనీయవా?
చిన్నతనం నుండే నీ శ్లోకాలు, పద్యాలు నేర్చాను. ‘శాంతా కారం’, ‘శ్రీరాముని దయచేతను’, ‘చేత వెన్నముద్ద’, ‘నీ పాదకమల సేవయు’, ‘కస్తూరీ తిలకం’, ‘ఎవ్వనిచే జనించు’ వంటివి బట్టీపట్టి నీ పటాలకు, ప్రతిమలకు చేతులు కట్టుకుని అప్పజెప్పేవాడిని. నీ వైభవ ప్రాభవము లను అతి మనోహరముగా వర్ణించిన అష్టాదశ పురాణ పఠనములను, రామాయణ, మహాభారత ఇతిహాసము లను చదివి, వాటిలోని నీ ఘనకార్య ములను దేశ విదేశాల్లోనూగాక, కేవలం 108 దివ్యవైష్ణవ దేశాలలోనేగాక, నీవు స్వయంభు వుగా వెలసిన పుణ్యక్షేత్రాలను, పుణ్యతీర్థాలను, మేము దర్శించినా, సందర్శించినా మాకు తృప్తి కలగదేమో ఓ అలంకారప్రియా! ‘నీ నామస్మరణ’ అను ఔషధ సేవనముచే సమస్త రోగములు నశించు నట. ‘రామజోగి మందు కొనరే. పామరులారా’ అని భక్త రామ దాసు అనుభవ పూర్వకముగా చెప్పాడు. ‘పిబరే రామరసం’ అని పాడిన సదాశివబ్ర##హ్మంద స్వామి కీర్తన మాకు ఆదర్శమే. మరి నీ ప్రధాన ఇరువది ఒక్క అవతారములందు మాకు ఆయుర్వేదాది వైద్యమందించిన ధన్వంతరి ఒక అవతారము గదా శ్రీమన్నారాయణ!
శ్రీహరి – పంచభూతాలు
ప్రకృతిలోని పంచభూతాలలోని భూమిపైన మారేడుదళ ముననున్న కుడివైపు ఆకు నీవని చదివితిని. తులసిచెట్టు, తులసిమాల నీకత్యంత ప్రీతి పాత్రమని ప్రతినిత్యము తులసికి నీరుపోసి, ఆ నీటిని నా శిరమున ధరించి, దళములను త్రుంచి నెమలిపింఛముగా నీకు పెట్టనిదే నాకు తోచదు గదా! రావిచెట్టును దర్శించి దాని మధ్యస్థానమున నీవున్నావని గ్ర#హంచి, ‘మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణ, అగ్రత: శివరూపాయ వృక్షరాజాయతేనమ:’ అని నిన్ను తలవనిదే నేనింటికి తిరిగిరాను దామోదరా! ఉసిరిక చెట్టు నీకు అత్యంత ప్రీతి పాత్రమని ఆ చెట్టునూ వీలైనంత సేవింతును. తులసి దళములు ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య తిథుల యందు కోయరాదట. ఆ దినము లందు నిన్ను లక్ష్మి కారణముగా జనించిన మారేడు దళముతో అర్చింతును. ఎందుకంటే కలియుగ దైవం అయిన వేంకటేశ్వర నామంలో ఈశ్వరుడున్నాడు కదా! అదీగాక గోవింద నామము లందును ‘బిల్వపత్రార్చిత గోవిందా’ అని చదివాను.
పంచభూతాలలోని ఆకాశమందును నిన్ను చూస్తాను. ఎందుకనగా ఏ భక్తుడు ఆపదలో నుండి నిన్ను ‘నారాయణా’ అని ఎలుగెత్తి పిల్చినా, ఖగవాహనుడివై నీవు వచ్చేది ఆకాశమార్గము ననే కదా! బలిచక్రవర్తిని నీవు మూడు అడుగుల నేల దానం అడుగగా, ఆ రాక్షసాధిపతి ఈయగా, నీ ఎడమ పాదమును భూగోళముపై ఉంచి, కుడిపాదమును త్రివిక్రముడివై ఆకాశమం దున ఉన్న ఖగోళముపైన ఉంచి, మూడవ అడుగు కోసం మరల బలిని అడిగినావు కదా. భగవద్గీతను అర్జునునకు బోధించునపుడు నీ విశ్వరూపమును ఆకాశమునకు ఎదిగియే గదా నీవు చూపినది లక్ష్మీనారాయణా!
పంచభూతాలలోని నీటియందును నిన్ను చూచితిని. ఆ నీటి యందే గదా నీవు తొలుత జనించి నారాయణుడ వైతివి. రామావ తారమున ఆదిత్య #హృదయము పఠించి రఘుకులదైవమైన, సూర్యనారాయణుడవైన నీకు ప్రాత:సంధ్యా సమయమున అర్ఘ్యపాద్యములనిచ్చితివి గదా! అంతకుమునుపు కృతయుగ తొలిపాదమున సముద్రమున మత్య్సావతారమెత్తి నీ పరమ భక్తులను, రక్షించి, ప్రళయ కాలమున ఒడ్డునకు చేర్చితివి. తర్వాత ఎత్తిన వరహావతారమున భూగోళమును తస్కరించి సముద్రనీటి మడుగున దాగిన #హరణ్యాక్షుని ఆ సముద్రమందే వధించి, భూమాతను చేపట్టితివి. ఆ మాత కోరగా, ‘నరకుడు’ అను పుత్రుని ఆమెకు ప్రసాదించితివి. రామావతారమున లంకను నీ రామ దండుతో చేరు సమయమున సముద్రుడు సహకరించని సందర్భ మున, ఆయన పైననే నారి సంధించబోగా, ఆయన క్షమార్పణలు కోరగా, నీటిపై వారధి గట్టి లంక చేరితివి. శ్రీకృష్ణావతారమున కాళింది మడుగున దాగిన కాళీయుని మర్దించి, ఆతని పొగరడ గించితివి. కురుక్షేత్ర యుద్ధ సమాప్తి దినమున దుర్యోధనుడు, పంచపాండవులకు కన్పడకున్నప్పుడు అతడు నీటిమడుగున హఠయోగము వేసి దాగుండుట కనిపెట్టి, అతని రెచ్చగొట్టి బైటికి రావించి, భీమునితో ద్వంద్వయుద్ధము చేయింపచేసి, హతమార్చి తివి. ఇటుల ఎన్నియో విధముల పంచభూతములలోని నీటితో
నీకు అనుబంధముగలదని, మళ్ళీమళ్ళీ నీ భారత, భాగవత కథ లను చదివి నీవు యోగనిద్రలేచి, మేల్కొని, నీ భక్తులను స్వయ ముగా నీవు ఉద్ధరించువరకు గడిపెదను. ఈ వృద్ధాప్యకాలమున ఏదియో ఒక రూపముననున్న నీ నామస్మరణయే మమ్ము భవసాగరము దాటింపగలదు గదా నీలమేఘశ్యామా! కర్ణాటక రాష్ట్ర బీదరు జిల్లాయందును నీటియందే నీవు జ్వలంతం నరసింహస్వామిగా ఆవిర్భవించి ఆ జలముననే భక్తులకు దర్శనం ఇచ్చుచుంటివి. అత్తి వరదరాజస్వామివై నలుబది ఏండ్లకు ఒకసారి నీటిమడుగు నుంచి బయటకు వచ్చి నలుబది దినములు దర్శనం ఇచ్చుచుంటివి.
ఆరాధనకై, నోమునకై, వ్రతమునకై, యజ్ఞయాగాది క్రతువు లకై మున్ముందుగా వెలిగించు దీపజ్యోతి స్వరూపుడవు నీవు. ఆ జ్యోతితో మొదలయ్యే యజ్ఞ స్వరూపుడవు నీవు. అగ్ని వలననే కదా నిప్పు వచ్చెడిది. నీవు యజ్ఞ వాహనుడవు, యజ్ఞమే నీవు. దైత్యులు యజ్ఞయాగాదులు చేయ అడ్డుపడుచున్నప్పుడు రామావతారాన కాచినదీ నీవే. వరహావతారమున, నారసింహావతారమున, పరశు రామావతారమున, శ్రీరాముడు రాక్షస సంహారము చేయు తరుణ మున, శ్రీకృష్ణుడవై దుష్టులను దునుమాడు సమయమున, రాయ బార సమయమున, నరుని రూపమైన అర్జునునితో యుద్ధ తరుణ మున, భీష్మునిపై కురుక్షేత్ర యుద్ధ సమాయాన, నీకు కోపమొచ్చి నప్పుడు నీ కన్నుల నుండి వచ్చినవి అగ్ని కణములే గదా!
శివకేశవ సంబంధము
మీ ఇరువురి మధ్య భేదము లేదని చెప్పు శ్లోకము ‘శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివవే…’ విష్ణుపురాణమును బట్టి ‘నీవే రుద్రుని సృజించి, సృష్టి విలయము చేయు పని అప్పచెప్పి తివి’. శివపురాణము ప్రకారము ‘శివుడే నిన్ను సృజించి స్థితికార కత్వ విధినప్పగించెనట.’ శివుని భస్మాసురుని బారినుండి కాపాడి నది నీవే. శివుని స#హకారముతోనే నీవు లోకకంటకుడగు జలం ధరుని వధించితివి.
‘నారాయణ’ పదం నుండి ‘రా’ అను అక్షరమును ‘నమశ్శి వాయ’ అన్న పదం నుంచి ‘మ’ అను అక్షరమును కలిపి ‘రామ’
ఒక కొత్త పదం పుట్టి వాల్మీకిని, వశిష్ఠుని, విశ్వామిత్రుని, భరధ్వా జుని, గౌతముని, అగస్త్యుని, జాబాలి అనే మహర్షులను తరింప చేసినది. నీవు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే. శ్రీ అనగా లక్ష్మీ దేవి.’రామ’ అను పదమునకు ‘శ్రీ’ చేరగా ‘శ్రీరామ’ అయితివి. సూర్యవంశమున శ్రీరాముడిగా జన్మించి సూర్యుడిని యుగయుగ ములు తల్చుకొనునట్లు చేసితివి. ‘మరి నన్ను ఉద్ధరింపవా?’ అని చంద్రుడు నిన్ను అడుగగా, ఆ దినము నుండి నీవు ‘శ్రీరామ చంద్రుడి’వి అయితివి. ‘శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే, సహస్రనామతత్తుల్యం రామనామవరాననే’ అని సాక్షాత్తు శివుడు విష్ణుస#హస్రనామ పారాయణ ఫలితమును, పార్వతి అడుగగా చెప్పెనట.
అన్నట్లు శివపార్వతుల పెళ్ళి పెద్దవూ నీవే. కన్యగానున్న పార్వతికి మారువేషమున వచ్చి ‘నేను నీకు శివునితో పెళ్ళి చేయించె దనని’ అభయమిచ్చి ఆ నారాయణికి నీవు రక్షాబంధము కట్టి, రాఖీ పండుగ మొదలగుటకు
కారకుడవైతివి.
నీ రూపాలతోనే నీ కలయిక
కృతయుగమున వరాహస్వామిగా, అవతార పర మార్థము జరిగాక సింహాచలమున నారసింహునితో కలిసి వరాహ నారసింహస్వామివైతివి. త్రేతాయుగాన పరశురామావతారమున నీ పిదప విష్ణ్వాంశగా జనించిన శ్రీరాముని సీతా కల్యాణ సమయ మున కలిసి ‘ఆ రాముడూ ఈ రాముడూ ఒకరే. అవతార పర మార్థము వేరని’ గ్రహించి, వెనుకకు మరలితివి.
శ్రీహరి – దేవతలు
అదితి పుత్రులందరూ ఆదిత్యులే. నీకు తోడపుట్టిన వారే. వారు సన్మార్గమున, సద్భుద్ధి, సదాలోచనలతో, సత్ప్రవర్తన, సశ్శీ లురై ఉండాలనే నీ తాపత్రయము. వారి కళ్యాణమునకై, ఉద్ధర ణకై, నీవు ఎన్నెన్నియో అవతారములనెత్తి ఆదుకొంటివి. సవతి తల్లి దితి పుత్రులు దైత్యులై దుర్మార్గములకు పాల్పడిననూ అన్ని యుగములందును సమభావముతో ప్రవర్తించితివి. సవతి తల్లి పుత్రులని పక్షపాతము చూపక రాక్షస వంశమున నీవు ప్రహ్లాదు నిగా జన్మించితివి. అతని మనమడైన బలిచక్రవర్తిని పాతాళము
నకు అధిపతిని చేసి, నీవు ఆది వరాహ రూపమున పాతాళము చేరి కాపలాకాచి దేవతల బారినుండి అతనిని కాపాడితివి.
నవగ్రహములందున్న బుధ గ్రహమునకు విష్ణువుగా అధిపతి ఐతివి. బుధ గ్రహమునకు అధిష్టాన దేవతయు ‘నారా యణ’ అనుపేరున నీవే ఉంటివి. మాఘమాసంలో శుద్ధ సప్తమిని ‘రథసప్తమి’గా సూర్యారాధనకై నిర్దేశించినదీ నీవే. నిరంతరము నీ నామజపం పలికే అన్యమతస్థులను, నీ నామోచ్చారణ గృహస్థా శ్రమాన ఉండి చేసుకునేవారిని. నీ నిత్యార్చన వీలుకానప్పుడు మానసిక పూజ చేసుకునేవారిని, కరుణించి, కాపాడి ముక్తినియ్యి ముక్తినాథా!
‘కాయేనా వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మ నా వా ప్రకతే స్వభావాత్‌
కరోమి యద్యతే సకలం పర్మస్మై
నారాయణతి సమర్పయామి’
లక్ష్మీవల్లభా! లక్ష్మీపతీ! గత ఆరు దశాబ్దాలుగా నీతో గల అనుబంధం ఈ నాలుగు నెలల కాలము నీవు యోగనిద్రలో ఉండగా, ఎటుల మరుతుము? ఎటుల విడుతుము? ఎటుల భరింతుము? ఒకవేళ నీవు యోగనిద్రలోకి పోకున్నచో అది కలయో! వైష్ణవ మాయయో కాగలదు గోపికామానసచోరా!
(నేడు తొలి ఏకాదశి… శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తున్న సందర్భంలో)

– డా|| దేశిరాజు
లక్ష్మీనరసింహారావు
7730048794

Advertisement

తాజా వార్తలు

Advertisement