Friday, November 22, 2024

ఎస్వీబీసీలో బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షప్రసారం

తిరుమల, ప్రభన్యూస్‌: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల మధ్య మీన ల గ్నంలో ధ్వజా రోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులు ఈ వేడుకలు చూడడం కోసం శ్రీవేంకటేశ్వర భక్తు చానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు. ఎస్విబిసి క్లీన్‌ఫీడ్‌ ద్వారా ఇతర చానళ్ళలో కూడా బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టారు. కోవిడ్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా దర్శన టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని చైర్మన్‌ విజ్ఞప్తి చేశారు. దర్శనం టికెట్లు కలిగిన భక్తులు వ్యాక్సినేషన్‌ లేదా కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకురావని సూచించారు.
ముఖ్యమంత్రి చేతులమీదుగా పలు ప్రారంభోత్సవాలు
ఈనెల 11వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు చేస్తారని చైర్మెన్‌ తెలిపారు. అక్టోబర్‌ 11 న తిరుపతిలోని బర్డ్‌ ఆసుపత్రి బ్లాక్‌లో రూ. 25 కోట్ల వ్యవయంతో నిర్మించిన చిన్న పిల్లల పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఆసుపత్రి ప్రారంభం. అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత రూ. 15 కోట్ల విరాళంతో నిర్మిం చిన గో మందిరం ప్రారంభం. రూ.25 కోట్ల వ్యయంతో దాత పున: నిర్మించిన అలిపిరి నుంచి తిరుమల నడకదారి పై కప్పు ప్రారంభం. అక్టోబర్‌ 12 న తిరుమలలో ఇండియా సిమెంట్స్‌ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందిపోటు ప్రారంభం. ఎస్విబిసి కన్నడ, హిందీ చానళ్ళ ప్రసారాలు ప్రారంభం, కర్ణాటక ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పొల్గొంటారు. వెనుకబడిన పేద వర్గాల భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రోజుకు సుమారు 1000 మంది చొప్పున వెనుకబడిన పేద వర్గాల భక్తులకు అక్టోబర్‌ 7 నుంచి 14 వ తేది వరకు శ్రీవారి బ్రహ్మత్సవ దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తామన్నారు. నూతన హింధూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో టిటిడి మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలు నిర్మించామన్నారు.
ఈ ఆలయాలు నిర్మించిన వెనుక బడిన ప్రాంతాల నుంచి పేద వర్గాల వారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతుందన్నారు. ఒక్కో జిల్లా నుంచి 10 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకువచ్చి దర్శనం చేయించి తిరిగి వారి ప్రాంతాలకు తీసుకెళతామని చెప్పారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏంర్పాటు చేశామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మార్గ మధ్యంలో స్థానిక దాతల సహకారంతో ఆహార పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement