Saturday, November 23, 2024

ఉత్తర భారతంలోనూ శారదా పీఠం సేవలు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలన్న పోరాటంపై రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామితో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి చర్చించారు. గురువారం ఢిల్లీలో సుబ్రహ్మణ్యస్వామి నివాసానికి వెళ్ళి స్వామీజీ సుదీర్ఘ సమయం పాటు- భేటీ- అయ్యారు. దేవాలయ వ్యవస్థను ప్రభుత్వ పరిధి నుంచి తప్పిస్తే ఏర్పడే పరిణామాల గురించి స్వామీజీ అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకుంటే దేవాలయాలను ఎవరికి అప్పగించాలి? ఎటు-వంటి సంస్థలను ఎంచుకోవాలి? ఎలాంటి అర్హతలు విధించాలి? తరహా సందేహాలపై సుబ్రహ్మణ్య స్వామిని అడిగి నివృత్తి చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భవిష్యత్తులో చేపట్టాల్సిన ధార్మిక కార్యక్రమాలపైనా స్వాత్మానందేంద్ర స్వామి చర్చించారు. కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన శ్రీకాకుళం జిల్లా గుళ్ళ సీతారామపురం ఆలయ దుస్థితిని వివరించి, దానిపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చూపిస్తున్న శ్రద్ధ గురించి స్వామీజీ వివరించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ద్వారా అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించడంలో శారదాపీఠం తీసుకున్న చొరవ గురించి చెప్పారు. ఉత్తర భారతదేశానికి విశాఖ శ్రీ శారదాపీఠం కార్యకలాపాలను విస్తరించాలని, అందుకు తన సహాయ సహకారాలు ఉంటాయని సుబ్రహ్మణ్య స్వామి ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామికి హామీనిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement