Saturday, November 23, 2024

ఈ నా కృతి నీకే అంకితం.. దైవలలామా!

103. అల్లన లింగమంత్రిసుతు డత్రిజగోత్రు డాదిశాఖ కం
చెర్ల కులోద్భవుండన ప్రసిద్ధుడనై భవదంకితంబుగా
ఎల్లకవుల్‌ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్‌ జగత్‌
వల్లభ! నీకు దాసుడను దాశరథీ! కరుణాపయోనిధీ!

తాత్పర్యం: శతకంలో చివరి అంకితాంక పద్యమిది. కవి తన గోత్రనామాదులు చెప్పి ప్రవర వల్లిస్తున్నాడు.
ఓ దయా సముద్రా! భద్రాద్రి రామచంద్రా! గోపన్న అనే కవీశ్వరుడను నేను, లింగమంత్రి కుమారుడను. ఆత్రేయ గోత్రం మాది. శుక్ల యజుర్వేద శాఖ మాది. మాది కంచెర్ల వంశము. నీ దాసుడనై కవులందరూ పొగడగా ఓ లోక నాయకా!
ఈ దాశరథీ శతకాన్ని రచించి నీకంకితం చేస్తున్నాను.
విశేషం: కావ్యం చివరలో ఆశ్వాసాంత గద్యలో కవులు తమ వంశాది వర్ణన చేయడం నన్నయాదులు పెట్టిన ఒరవడి. దీనినే బిరుదు గద్య అంటారు. రాయలు గద్యానికి బదులు చివర పద్యం వ్రాశాడు. గోపన్న భద్రాచల రామచంద్రునికి ఈ శతకం అంకితం చేసి రామదాసుడయ్యాడు. ఈ శతకాన్ని ఆసాంతం నిత్యం పఠించిన ఆంధ్రప్రభ పాఠకులకు ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షాల వల్ల ఆయురారోగ్య సంపదలు లభించుగాక!

డాక్టర్‌ రేవూరు అనంతపద్మనాభరావు
98665 86805

Advertisement

తాజా వార్తలు

Advertisement